అప్పు ఇచ్చిన పాపానికి హత్య.. మృతదేహాన్ని పార్సిల్‌ చేసి..

5 Jan, 2022 13:06 IST|Sakshi
నిందితుడు రాజును తీసుకెళ్తున్న పోలీసులు, రోదిస్తున్న చంద్రశేఖర్‌ కుమార్తె లావణ్య

తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన 

కేసును ఛేదించిన పోలీసులు 

చిత్తూరు: కష్టాల్లో ఉన్నాం.. కాస్త డబ్బు అప్పుగా ఇస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం.. అనగానే సహాయం చేసిన పాపానికి వ్యక్తిని హత్య చేసి భాకరాపేట ఘాట్‌రోడ్డులో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెస్ట్‌ డీఎస్పీ నరసప్ప వివరాల మేరకు.. తిరుపతి ఎల్‌బీ నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌(54) తిరుపతి టూరిజం శాఖలోని ట్రాన్స్‌పోర్టులో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తూ వడ్డీ వ్యాపారం చేసేవాడు.

తిరుపతికి చెందిన మధుబాబు, రాజు, మధురెడ్డిలకు వడ్డీకి కొంత నగదు ఇచ్చాడు. సరిగ్గా వడ్డీ చెల్లించకపోవడంతో వారిని నిలదీశాడు. ఈ క్రమంలో డిసెంబర్‌ 31న చంద్రశేఖర్‌కు మధుబాబు ఫోన్‌ చేసి డబ్బులిస్తానని పిలిచాడు. ఇంటి నుంచి వెళ్లిన చంద్రశేఖర్‌ ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎస్వీ యూనివర్శిటీలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు చంద్రశేఖర్‌ సెల్‌ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులోని అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు.  డీఎస్పీ నరసప్ప, సీఐలు రవీంద్ర, శ్రీనివాసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. మంగళవారం మృతదేహాన్ని గుర్తించారు.   

ఆ రోజు ఏం జరిగిందంటే.. 
చంద్రశేఖర్‌కు ఫోన్‌ రాగానే తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లోని మధుబాబు గోడౌన్‌కు వెళ్లాడు. మధుబాబు తన వద్ద డబ్బులు లేవని, డబ్బు చెల్లించేవరకు తన భూమి దస్తావేజులు ఉంచుకోమని వాటిని అందజేశాడు. దస్తావేజులు పరిశీలిస్తున్న చంద్రశేఖర్‌ను వెనుక నుంచి మధురెడ్డి, రాజు రాడ్డుతో తలపై మోదారు. అనంతరం కేకలు వేయకుండా నోటికి గుడ్డను కట్టి, కాళ్లు చేతులను కట్టేసి దాడికి పాల్పడ్డారు. మృతి చెందాడని నిర్ధారించుకుని గోనె సంచిలో కుక్కి అట్టబాక్సులో ఉంచారు.

తెలిసిన వారి కారు తీసుకుని డిసెంబర్‌ 31వ తేదీ సాయంత్రం భాకరాపేట ఘాట్‌రోడ్డుకు చేరుకుని, లోయలో మృతదేహాన్ని పడేసి పారిపోయినట్లు డీఎస్పీ వెల్లడించారు. పరారీలో ఉన్న మధుబాబు, మధురెడ్డిల కోసం గాలిస్తున్నామని తెలిపారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. మృతుడికి భార్య కస్తూరి, కుమారుడు రూపేష్‌, కుమార్తె లావణ్య ఉన్నారు.
 

మరిన్ని వార్తలు