8 కిలోల బంగారంతో వ్యాపారి అదృశ్యం 

24 Aug, 2021 04:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 పోలీసులకు బాధితుల ఫిర్యాదు  

మంగళగిరి : సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన 8కిలోల బంగారంతో ఓ వ్యాపారి ఉడాయించి.. పలువురిని నిండా ముంచిన ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బంగారం వ్యాపారి పి.దిలీప్‌కుమార్‌ గత కొన్నేళ్లుగా బంగారు వ్యాపారుల వద్ద బంగారం తీసుకుని వస్తువులు చేసి ఇవ్వడం, చేసిన వస్తువులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించి నగదు తెచ్చి ఇస్తూ నమ్మకంగా వ్యవహరించేవాడు. శ్రావణమాసం కావడంతో  గత 15 రోజుల నుంచి పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు దిలీప్‌కి సుమారు ఎనిమిది కిలోల బంగారం ఇచ్చి వస్తువులు చేయాలని కోరారు.

పట్టణానికి చెందిన జి.రమేష్‌ 180 గ్రాములు, దీపాల బుజ్జి 609, అందె వెంకటసత్యనారాయణ 5000, బిట్రా సుబ్బారావు 1000, మునగాల సురేష్‌ 180, బేతు సత్యనారాయణ 411, జి.సురేష్‌ 308, ఎం. చంద్రశేఖర్‌ 388, దామర్ల వెంకటేశ్వర్లు 200 గ్రాములు.. ఇలా మొత్తం 8కిలోల 276 గ్రాముల బంగారం ఇచ్చారు. అయితే బంగారంతో ఉన్న బ్యాగు విజయవాడలో తాను బాత్రూమ్‌కు వెళ్లి వచ్చేసరికి మాయమైందని ఓ లేఖ రాసి ఇంటిలో ఉంచిన దిలీప్‌ శనివారం నుంచి అదృశ్యమయ్యాడు.

సదరు వ్యాపారులకు బంగారం తిరిగి ఇచ్చే స్థోమత తనకు లేదని, బంగారం పోయిన విషయంలో బాధ్యతంతా తనదేనని.. తన తల్లిదండ్రులకు, భార్యకు ఎలాంటి సంబంధం లేదని లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సుమారు రూ.4కోట్ల విలువైన బంగారంతో దిలీప్‌ ఉడాయించడంతో అవాక్కయిన బాధితులు సోమవారం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు