వ్యాపారి వీడియో కలకలం: కరడుగట్టిన బీజేపీ అభిమాని నుంచి విమర్శల దాకా..

10 Feb, 2022 10:55 IST|Sakshi
రాజీవ్​ తోమర్​ ఫేస్​బుక్​ లైవ్​ ద్వారా సేకరించిన చిత్రం

కరోనాతో కోట్లాది మంది బతుకులు తలకిందులు అయ్యాయి. ఉపాధి లేక ఎంతో మంది ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు. లాక్​డౌన్​ తమ జీవితాలన్ని తలకిందులు చేసిందంటూ బాధపడేవాళ్లూ ఉన్నారు. ఈ జాబితాలో రాజీవ్​ తోమర్​ కూడా ఉన్నారు. కరోనా దెబ్బకి కోలుకోలేకుండా అయిన ఈయన.. ఏకంగా ప్రాణం తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడీ ఉదంతం ఇప్పుడు రాజకీయ విమర్శలకు తావిచ్చింది. కరడుగట్టిన బీజేపీ అభిమాని కాస్త విమర్శలు చేయడం పొలిటికల్​ హీట్​ పెంచేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌కు చెందిన బూట్ల వ్యాపారి రాజీవ్ తోమర్ (40) దంపతులు లైవ్‌లో విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో రాజీవ్​ భార్య మరణించగా, రాజీవ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు ఆయన ఫేస్‌బుక్‌ లైవ్‌లో సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీపై, ప్రభుత్వాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన మరణానికి మోదీనే కారణం అవుతారంటూ వ్యాఖ్యలు చేశారు రాజీవ్​. 

భార్య అడ్డుకుంది కానీ..
నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల తాను అప్పుల పాలయ్యానని ఆ లైవ్​ వీడియోలో రాజీవ్​ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, చిన్న వ్యాపారులకు మోదీ ఎంతమాత్రమూ హితుడు కాదని విమర్శించారు. ప్రధానికి చేతనైతే పరిస్థితులు చక్కదిద్దాలని హితవు పలికారు.  ‘‘ప్రభుత్వం నాలాంటి వాళ్ల మాట వినడం లేదు.. కనీసం నువ్వైనా విను’’ అంటూ విసురుగా విషం తాగేశారు. భర్త విషం తాగడంతో షాక్​ తిని.. ఆమె కూడా ఆ వెంటనే విషం తీసుకున్నారు.

కాసేపటికి లైవ్​ ద్వారా స్పందించిన కొందరు.. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పూనం మరణించినట్టు నిర్ధారించారు. రాజీవ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 2020లో విధించిన కరోనా లాక్‌డౌన్ కారణంగా రాజీవ్ వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తీసుకున్న రుణాలు చెల్లించే వీలులేకపోయిందన్నారు. 

బీజేపీ అభిమాని నుంచి.. 
రాజీవ్​ తోమర్​ కరడుగట్టిన బీజేపీ అభిమాని. ఈ మేరకు బీజేపీ మీద అభిమానంతో కట్టిన బ్యానర్లలో ఆయన ఫొటోలు ఉండడం, అవి సోషల్​ మీడియాలో వైరల్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పలువురు కీలక నేతలతో ఆయన సన్నిహితంగా దిగిన ఫొటోలు సైతం వైరల్​ అవుతున్నాయి.


భాగ్​పట్​​ ఎంపీ సత్యపాల్​ సింగ్(ఎడమ)తో రాజీవ్​(కుడి)

వీడియోలో చెప్పినట్లుగా బీజేపీ ఎలాంటి సహకారం అందించకపోవడం వల్లే చనిపోయి ఉంటారని సన్నిహితులు చెప్తున్నారు. అయితే బీజేపీ మాత్రం వ్యక్తిగత కారణాలకు.. పార్టీని నిందించడం సరికాదని అంటున్నారు. ఈ మేరకు సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కరోనాతో ఎంతో మంది నష్టపోయారని, కేవలం పార్టీ ప్రతిఫలాలు అందలేదన్న ఉద్దేశంతో నిందించడం సబబేలా అవుతుందని రాజీవ్​ వీడియోను ఖండిస్తున్నారు పలువురు బీజేపీ నేతలు.

ఇక ఘటనపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ స్పందించారు. అన్యాయం జరిగినా వదలం. ఈ పోరాటంలో మీరు ఒంటరివారు కాదు - నేను మీతో ఉన్నాను అంటూ రాజీవ్​ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్​ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. రాజీవ్ భార్య మృతికి సంతాపం తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై స్పందించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు