ఉడేగోళంలో విషాదం... అన్నదమ్ములని బలిగిన్న కరెంట్‌

18 Jul, 2022 09:08 IST|Sakshi

కణేకల్లు: ఇద్దరు అన్నదమ్ములను కరెంట్‌ బలిగొంది. ఈ ఘటనతో కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామం విషాదంలో మునిగిపోయింది. మాజీ సర్పంచ్‌ కురుబ యల్లప్ప (లేట్‌)ది రైతు కుటుంబం. ఈయనకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయమే వీరికి ప్రధాన జీవనాధారం. హెచ్చెల్సీకి నీరు విడుదల చేయడంతో బోర్లున్న రైతులు ముందుగానే వరినారు పోసుకోవడం ఆనవాయితీ. యల్లప్ప కుమారులు రమేష్‌ (34), దేవేంద్ర (28), వన్నూరుస్వామి తమ పొలంలో మూడ్రోజుల కిందట వరి నారు పోశారు. ఆదివారం నారు మడికి నీరు పెట్టి పొలంలో చిన్నాచితక పనులు చేసుకొద్దామని ఈ ముగ్గురూ పొలానికి వెళ్లారు. రమేష్‌ స్టార్టర్‌ ఆన్‌ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు.

అన్నను లేపేందుకు వెళ్లిన దేవేంద్ర కూడా షాక్‌కు గురయ్యాడు. వీరిని కాపాడేందుకు వెళ్లిన వన్నూరుస్వామి షాక్‌ కొట్టగానే ఎగిరి పడ్డాడు. వెంటనే పక్కపొలం రైతులు, స్థానికులకు, కుటుంబ సభ్యులకు సమాచారమందించాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన చేరుకుని వారిని కణేకల్లు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే రమేష్‌, దేవేంద్ర మృతి చెందారు. వీరిని కాపాడే క్రమంలో గాయపడ్డ మరో సోదరుడు వన్నూరుస్వామి బళ్లారిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో రమేష్‌కు భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు, దేవేంద్రకు భార్య కస్తూరి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడటంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

దేవుడా ఎంత పనిచేశావయ్యా.. 
పొలానికి వెళ్లి తొందరగా వస్తామని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతిరా.. మీరు లేని జీవితం ఎలా గడపాలి.. పిల్లలకు ఏమని సమాధానం చెప్పాలి’ అంటూ    మృతుడు రమేష్‌ భార్య జ్యోతి, దేవేంద్ర భార్య కస్తూరి గుండెలవిసేలా రోదించారు. ‘అక్కా... అని ప్రేమగా పలకరించే చిన్నోడి (దేవేంద్ర)ని తీసుకెళ్లి ఎందుకింత అన్యాయం చేశావు దేవుడా’ అంటూ విలపించిన అక్క జయమ్మను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఆ దేవుడు నన్నైనా తీసుకుపోయి ఉంటే బాగుండేదంటూ కన్నీరు మున్నీరయ్యారు. ‘దేవురే ఒబ్బరల్లా... ఇబ్బుర్ని (దేవుడా ఒకరిని కాదు ఇద్దరిని) ఎంగే తకొండు హోగిదియప్పా(ఎలా తీసుకెళ్లావు?)’ అంటూ అక్కాచెల్లెళ్లు విలపించడం అందర్నీ కలచి వేసింది. 

(చదవండి:  పార్థుడి పనైపోయిందా!.. చంద్రబాబు 'బాది'పోయాడా?)

మరిన్ని వార్తలు