ఉగాది పండగ రోజు తీవ్ర విషాదం.. విషవాయువుతో ఊపిరాడక అన్నాదమ్ములు మృతి

23 Mar, 2023 07:51 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి: ఉగాది పండగ రోజున ఓ వలస కార్మికుల కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. అట్టల ఫ్యాక్టరీలో పల్ఫ్‌ (పేపర్‌గుజ్జు) ఉండే బావిని శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అన్నదమ్ములు విషవాయువుతో ఊపిరాడక ప్రాణాలొదిలారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఎస్‌ఎస్‌ అట్టల ఫ్యాక్టరీలో బుధవారం చోటుచేసుకుంది.

సాయంత్రం 5.30 గంటల సమయంలో ఫల్ప్‌ బావిని శుభ్రం చేసేందుకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కావాసి జోగా (21), కావాసి బుద్ధరామ్‌ (23) అనే వలస కార్మిక సోదరులు పది అడుగుల లోతు ఉన్న బావిలోకి నిచ్చెన సాయంతో దిగారు. వెంటనే ఇద్దరూ ఊపిరాడక కుప్పకూలారు. గమనించిన తోటి కార్మికులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకుని, వారిని బయటకు తీసేందుకు ఐదుగురు బావిలోకి దిగారు. వారిని బయటకు తీసుకొస్తున్న క్రమంలో మరో ఇద్దరు కూడా విషవాయువులతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.

వీరిలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన గొగ్గలి రాంబాబును భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొదట బావిలోకి దిగిన వలస కారి్మకులను బయటకు తీసుకురాగానే బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో కావాసి జోగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బుద్ధరామ్‌ భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు.

మృతులిద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కాంకిపొర గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఫ్యాక్టరీలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పది మంది కారి్మకులు పని చేస్తున్నారు. సోదరులిద్దరూ ఒకేసారి మృత్యువాత పడటంతో అక్కడున్న వారిలో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: హ్యాండ్‌ గ్రెనేడ్లు పేల్చేశారు!

మరిన్ని వార్తలు