బాగా చదువుకో.. ఇదే నా చివరి కాల్‌

25 Oct, 2021 08:06 IST|Sakshi
మృతురాలు సుష్మ(ఫైల్‌ )

క్షణికావేశం.. బలవన్మరణం

వివాహిత ఆత్మహత్య

కాపురం ఉండే విషయంపై భర్తతో విభేదాలు

ఎమ్మిగనూరు రూరల్‌(కర్నూలు జిల్లా): క్షణికావేశానికి లోనైన ఓ వివాహిత ఎమ్మిగనూరులో శనివారం అర్ధరాత్రి సోడియం హైపోక్లోరైడ్‌ తాగి ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని శిల్పా ఎస్టేట్‌లో నివాసముంటున్న మోనే తిమ్మప్ప, లక్ష్మీదేవిలకు కుమార్తె మోనే సుష్మ(25), కుమారుడు మోహన్‌లు సంతానం. తిమ్మప్ప పెద్దకడుబూరు మండలంలో విద్యుత్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె సుష్మకు ట్రాన్స్‌కో ఏఈగా సంవత్సరంన్నర క్రితం ఉద్యోగం వచ్చింది. కుమారుడు మోహన్‌ హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. సుష్మ సిరాలదొడ్డి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఏఈగా విధులు నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే నెలలో కర్నూలుకు చెందిన బడేసాబ్, శారదల కుమారుడు కిశోర్‌కుమార్‌తో ఆమెకు వివాహం చేశారు. కిశోర్‌కుమార్‌ కోడుమూరు మండలం పులకుర్తి కెనరా బ్యాంక్‌లో బ్రాంచ్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్‌ నటుడు కన్నుమూత 

దంపతుల మధ్య కాపురం ఉండే విషయంలో మనస్పర్థలు వచ్చాయి. కర్నూలులో ఉండాలని భర్త, కాదు ఎమ్మిగనూరులో ఉండాలని భార్య వాదించుకునే వారని తెలిసింది. ఇదే విషయంపై దసరా రోజు ఇంటికి వచ్చిన భర్తతో సుష్మ గొడవ పడినట్లు తెలిసింది. శనివారం విధులకు వెళ్లి రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చింది. బంధువులు, అధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు, అలాగే హైదరాబాద్‌లో ఉండే తమ్ముడు మోహన్‌కు కాల్‌ చేసి బాగా చదువుకో ఇదే నా చివరి కాల్‌ అని చెప్పినట్లు తెలిసింది. ఇంట్లో భోజనం చేసి గదిలోకి వెళ్లి పడుకుంది.

ముందే తెచ్చుకున్న సోడియం హైడ్రోక్లోరైడ్‌ తాగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా  కొద్దిసేపటికే మృతి చెందింది. కుమార్తె ఆత్మహత్య చేసుకోవటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలుసుకున్న టౌన్‌ ఎస్‌ఐ మస్తాన్‌వలి ప్రభుత్వాసుపత్రికి చేరుకొని తల్లిదండ్రులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తమ అల్లుడిపై అనుమానం లేదని, కాపురం పెట్టే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవతో ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఎస్‌ఐకు తెలిపారు. తహసీల్దార్‌ జయన్న, టౌన్‌ ఎస్‌ఐ మస్తాన్‌వలి పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని టౌన్‌ ఎ‹స్‌ఐ మస్తాన్‌వలి పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రికి పెద్ద సంఖ్యలో విద్యుత్‌ ఉద్యోగులు తరలివచ్చారు.
చదవండి: ఆ టీడీపీ నాయకుడి దారి.. అడ్డదారి  

మరిన్ని వార్తలు