కోరిక తీరిస్తే.. అండగా ఉంటా!

25 Jun, 2022 08:54 IST|Sakshi

అనంతపురం క్రైం: ఓ వితంతువుపై ట్రాన్స్‌కో ఉద్యోగి కన్నేశాడు. తన కోరిక తీరిస్తే కుటుంబానికి అండగా ఉంటానంటూ వెంటపడుతున్నాడు. తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటానే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగే ప్రసక్తే లేదని ఆమె తెగేసి చెప్పింది. అయినా ఆ ఉద్యోగి వేధింపులు ఆపడం లేదు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను అనంతపురం టూటౌన్‌ సీఐ రాఘవన్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

శారదనగర్‌లో ఉంటున్న ఓ మహిళ భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. భర్త మరణానంతరం కుటుంబ భారం ఆమెపై పడింది. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారికి సపర్యలు చేసి.. వచ్చే సంపాదనతో పిల్లలను పోషించుకుంటోంది. నడిమివంక ప్రాంతంలో నివాసముంటున్న వితంతు తల్లికి నాలుగోరోడ్డులో నివాసముంటున్న ట్రాన్స్‌కో కార్యాలయ అటెండర్‌ అబ్దుల్‌ నబీసాబ్‌ పరిచయముంది. అలా అన్ని విషయాలూ తెలుసుకున్న ఇతడు వితంతువుపై మోజుపడ్డాడు. తన కోరిక తీరిస్తే ఆమె కుటుంబ బాగోగులు చూసుకుంటానని నమ్మబలికాడు.

ఇందుకు వితంతువును ఒప్పించే విషయంలో తల్లి కూడా ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే ఇందుకు వితంతువు ససేమిరా ఒప్పుకోలేదు. నెల రోజుల క్రితం అబ్దుల్‌ నబీసాబ్‌ వితంతువు ఇంటికి వెళ్లి ఒప్పుకోవాలంటూ బలవంతపెట్టాడు. ఆమె ఈసారి ఘాటుగానే సమాధానమిచ్చింది. తాను ఇళ్లల్లో పని చేసుకునైనా పిల్లలను పోషించుకుంటాను తప్ప నీలాంటి వాడితో ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

మరోసారి వెంటపడి వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. అయినా అతడిలో మార్పు రాలేదు. మళ్లీ వేధింపులకు దిగుతుండటంతో వితంతువు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రాఘవన్‌కు ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశాల మేరకు ఎస్‌ఐ అల్లా బకాష్‌ విచారణ చేపట్టిన అనంతరం ట్రాన్స్‌కో ఉద్యోగి అబ్దుల్‌ నబీసాబ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వితంతు తల్లిపైనా కేసు నమోదు చేశారు.

(చదవండి: ఆహార భద్రత చట్టం అమలు బాధ్యత అధికారులదే..)

మరిన్ని వార్తలు