బ్యాంకు ఉద్యోగులకు బదిలీ శిక్ష!

12 Nov, 2020 02:54 IST|Sakshi

జస్టిస్‌ రమణ కుమార్తె లావాదేవీలు వెల్లడించినందుకు..

యూనియన్‌ బ్యాంకు తీరుపై సిబ్బందిలో చర్చ

అమరావతి భూ కుంభకోణంలో లావాదేవీల వివరాలు కోరిన దర్యాప్తు సంస్థ

ఏసీబీ అడిగిన వివరాలివ్వడం చట్టబద్ధమేనన్న బ్యాంకు లీగల్‌ విభాగం

ఆ ప్రకారమే అందచేసిన ఐదుగురు అధికారులకు ‘పనిష్మెంట్‌ ట్రాన్స్‌ఫర్‌’

ముగ్గురు చెన్నైకి.. ఇద్దరు ముంబైకి.. వీరిలో ఇద్దరు మహిళలే

త్వరలో రిటైరయ్యే వారిపై నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్‌ సమయంలో బదిలీ వేటు! మహిళలని కూడా చూడకుండా ఉన్నఫళాన పొరుగు రాష్ట్రాలకు ‘పని ష్మెంట్‌ బదిలీ’..! ఇంతకీ వారు చేసిన నేరం.. దర్యాప్తు సంస్థ చట్టబద్ధంగా కోరిన వివరాలను అందచేయడమే!

సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కుమార్తె బ్యాంకు లావాదేవీల వివరాలను దర్యాప్తు సంస్థ ఏసీబీకి అందచేసినందుకు యూనియన్‌ బ్యాంక్‌ తమ ఉద్యోగులను ‘పనిష్మెంట్‌ ట్రాన్స్‌ఫర్స్‌’ చేయడం సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది. అమరావతి భూ కుంభకోణంలో జస్టిస్‌ ఎన్వీ రమణ కుమార్తెలు భువన, తనూజలపై దర్యాప్తు సంస్థ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. వారి లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ ఆ వివరాలు ఇవ్వాలని కోరుతూ ఖాతాలున్న బ్యాంకులకు లేఖలు రాసింది. జస్టిస్‌ ఎన్వీ రమణ ఇద్దరి కుమార్తెల్లో ఒకరి ఖాతా ఆంధ్రాబ్యాంకు (ఇప్పుడు యూనియన్‌ బ్యాంకులో విలీనమైంది)లో ఉంది. ఆమె ఖాతా తాలూకు లావాదేవీలు, కేవైసీ వివరాలు ఇవ్వాలని ఏసీబీ ఆ బ్యాంకును కోరింది. ఏసీబీ విజ్ఞప్తిపై స్పందించిన బ్యాంకు సిబ్బంది లీగల్‌ విభాగం అభిప్రాయాన్ని తీసుకున్నారు. పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వడం చట్టబద్ధమేనని లీగల్‌ విభాగం తెలిపింది. పోలీసులు అడిగిన ఖాతాలు హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ శాఖలో ఉన్నాయని గుర్తించారు. దీంతో ఆన్‌లైన్‌లో లెడ్జర్‌ తెరిచి లావాదేవీల వివరాలు పోలీసులకు అందచేశారు.

అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు..
సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెల బ్యాంకు లావాదేవీలను ఏసీబీ అధికారులకు ఇచ్చిన తర్వాత బ్యాంకు ఉన్నతాధికారులపై ఉన్నత స్థాయి నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ వివరాలను వెల్లడించడం చట్ట విరుద్ధం కాదని అభిప్రాయాన్ని చెప్పిన బ్యాంక్‌ లీగల్‌ విభాగం అధికారుల మీద ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘అమరావతి భూ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వారి బ్యాంకు లావాదేవీల వివరాలు ఇవ్వడం చట్ట విరుద్ధం కాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెలకు దేశంలో చట్టం వేరుగా ఉండదు. వివరాలు పోలీసులకు ఇవ్వడం తప్పేమీ కాదు’ అని లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ ఉన్నతాధికారులకు బదులిచ్చిన్నట్లు తెలిసింది.

ఒక్క బ్యాంకుతో ఆగదని..
అనుమానాస్పద లావాదేవీల వివరాలను వెల్లడించడం ప్రారంభమైతే అది ఒక్క బ్యాంకుతో ఆగదని, మిగతా బ్యాంకుల్లోని ఖాతాల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తారని నిందితులు అనుమానించారు. తమ ఖాతా లావాదేవీల వివరాలను వెల్లడించిన యూనియన్‌ బ్యాంకు అధికారుల మీద చర్యలు తీసుకుంటే మిగతా బ్యాంకులు వివరాలు ఇచ్చేందుకు జంకుతాయని భావించారు. ఈ నేపథ్యంలో సమాచారం ఇచ్చిన అధికారులకు ‘పనిష్మెంట్‌’ ఇవ్వాలని యూనియన్‌ బ్యాంకు ఉన్నతాధికారుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీనికి తలొగ్గిన అధికారులు విజయవాడ రీజనల్‌ కార్యాలయంలో పని చేస్తున్న ఐదుగురు అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. అయితే తామేమీ చట్టవిరుద్ధమైన పని చేయలేదని వారు గట్టిగా తేల్చి చెప్పడంతో ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఆ ఐదుగురిని హఠాత్తుగా బదిలీ చేసినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు. 

ఇద్దరు మహిళా అధికారులే..
బదిలీ వేటు విధించిన ఐదుగురిలో ఒకరు లీగల్‌ విభాగం మహిళా అధికారి కాగా మరొకరు ‘పీ అండ్‌ డీ’ విభాగానికి చెందిన మహిళా అధికారి. లెడ్జర్‌ తెరిచి చూసిన మరో ముగ్గురు అధికారుల మీద కూడా బదిలీ వేటు వేశారు. మొత్తం ఐదుగురిలో ముగ్గురిని చెన్నైకి మరో ఇద్దరిని ముంబైకి బదిలీ చేశారు. ముంబైకి బదిలీ అయిన ఓ అధికారి మరో ఏడాదిలో పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న అధికారిని బదిలీ చేయకూడదనే నిబంధనను కూడా బ్యాంకు పాటించకపోవడం గమనార్హం. 

ఏం తప్పు చేశారని...?
‘కోవిడ్‌ నేపథ్యంలో 2021 మార్చి వరకు బదిలీలు లేవని నెల క్రితం సర్క్యులర్‌ ఇచ్చారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా బదిలీ ఉత్తర్వులు వెలువరించారు. కోవిడ్‌ భయం వెంటాడుతున్న సమయంలో 59 ఏళ్ల వయసున్న అధికారిని ముంబైకి బదిలీ చేశారు. ఇలా చేస్తే ఉద్యోగుల ఆత్మవిశ్వాసం దెబ్బతినదా? వాళ్లు ఏం తప్పు చేశారు? చట్టబద్ధంగానే నడుచుకున్నారు’ అని అధికారులు పేర్కొంటున్నారు.

బదిలీ షెడ్యూల్‌ పాటించకుండా..
బ్యాంకు ఉద్యోగులను ఎప్పుడుపడితే అప్పుడు బదిలీలు చేయరు. నిర్దిష్ట షెడ్యూల్‌లో మాత్రమే బదిలీలు జరుగుతాయి. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తె ఖాతా లావాదేవీల వివరాలు ఇచ్చినందుకు వారికి పనిష్మెంట్‌ శిక్ష విధించడం గమనార్హం. ఉద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు యూనియన్లు గట్టిగా ప్రశ్నించడం సాధారణం. ఈ వ్యవహారంలో సుప్రీంను బూచిగా చూపిస్తూ యూనియన్‌ నేతల నోరు మూయించినట్లు బ్యాంకు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు.

మరిన్ని వార్తలు