ప్రాణాన్ని బలిగొన్న ‘ఉచ్చు’

30 May, 2022 11:01 IST|Sakshi

మారేడుమిల్లి: వన్యప్రాణులకోసం విద్యుత్‌ తీగలతో ఏర్పాటుచేసిన ఉచ్చు ఒకరిని బలిగొంది. మరొకరిని తీవ్ర గాయాల పాల్జేసింది. ఎస్‌ రాము, బంధువుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. మండలంలోని చట్లవాడ పంచాయతీ పరిధిలోని బొజ్జలగండి గ్రామానికి చెందిన కొండ్ల శ్యాముల్‌ రెడ్డి (26), పల్లాల రమేష్‌ రెడ్డితో కలిసి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కర్రల నిమిత్తం శనివారం రాత్రి వెళ్లారు. వాటిని నరికి అటవీ ప్రాంతం నుంచి రహదారి వద్దకు తీసుకువస్తున్నారు. అదేమార్గంలో కొందరు వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఉచ్చు ఏర్పాటుచేశారు.

దానికి విద్యుత్‌ తీగలు అమర్చారు. శ్యాములరెడ్డి, సురేష్‌ రెడ్డి తెస్తున్న కర్రల చివర్లు విద్యుత్‌ తీగలకు తగలడంతో ఇరువురు షాక్‌కు గురయ్యారు. దీంతో శ్యాముల్‌రెడ్డి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అతని వెనుక వస్తున్న రమేష్‌ రెడ్డి కాళ్లకు  తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమేష్‌రెడ్డిని అదే ప్రాంతంలో ఉన్న స్థానికులు బోదులూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవలు నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పోలీసులకు బంధువులు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ రాము సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. 

(చదవండి: చెత్తకు కొత్త రూపుం...వేస్ట్‌ క్రాఫ్ట్‌)

మరిన్ని వార్తలు