మనోజ్ అ‌వినీతి విలాసం.. 

20 Aug, 2020 11:29 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలు, నగదు, డమ్మీ పిస్తోళ్లు

ట్రెజరీ సీనియర్‌ అకౌంటెంట్‌ ఆస్తులు లెక్కతీసిన అధికారులు 

ఎనిమిది ట్రంకు పెట్టెల్లో ఆభరణాలు, నగదు

మూడు పిస్తోళ్లు, ఒక ఎయిర్‌ గన్‌ స్వాధీనం

ఏడు ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, నాలుగు ట్రాక్టర్లు సీజ్‌  

అనంతపురం క్రైం: ట్రంకు పెట్టెల్లో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలు వెలుగుచూసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడం తెలిసిందే. వీటి వెనుక ఉన్న ట్రెజరీ సీనియర్‌ అకౌంటెంట్‌ గాజుల మనోజ్‌కుమార్‌ ఆస్తుల విలువ రూ.3 కోట్ల పైమాటేనని పోలీసుల విచారణలో వెల్లడయింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్‌డీ రామకృష్ణ ప్రసాద్‌ వెల్లడించారు.

బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీలోని బాలప్ప ఇంట్లో మారణాయుధాలున్నాయనే సమాచారంతో ఈ నెల 18న ఎస్పీ సత్యయేసుబాబు ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీసీఎస్‌ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య నాలుగు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు సోదాలు నిర్వహించి బంగారం, వెండి, నగదు, డిపాజిట్‌ పత్రాలు స్వాధీనం చేసుకుని తహసీల్దార్‌ సమక్షంలో పంచనామా నిర్వహించారు. అవన్నీ ట్రెజరీ కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ అకౌంటెంట్‌ మనోజ్‌వేనని విచారణలో గుర్తించారు.

రూ.15 లక్షల విలువ చేసే హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌.. 

బాలప్ప ఇంట్లోకి పెట్టెలు ఎలా వచ్చాయంటే.. 
మనోజ్‌ అనంతపురంలోని సాయినగర్‌ 8వ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఇతని తండ్రి జి.సూర్యప్రకాష్‌ పోలీసు శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తూ మరణించాడు. కారుణ్య నియామకం కింద 2005లో మనోజ్‌కుమార్‌కు ట్రెజరీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. మనోజ్‌కుమార్‌కు బుక్కరాయసముద్రంలో వ్యవసాయ క్షేత్రం ఉండగా.. అందులో పనిచేసేందుకు స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన నాగలింగ వెళ్లేవాడు. అలా నమ్మకం ఏర్పడిన తర్వాత అతడినే మనోజ్‌ తన కారు డ్రైవర్‌గా నియమించుకున్నాడు. ఏడేళ్లుగా నాగలింగ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మనోజ్‌ ఆస్తులను నాగలింగ తన మామ బాలప్ప ఇంట్లో దాచిపెట్టాడు.  

నగదు...నగలు...వాహనాల స్వాధీనం 
మనోజ్‌ కారు డ్రైవర్‌గా పనిచేసే నాగలింగ మామ బాలప్ప ఇంట్లో ఎనిమిది ట్రంకు పెట్టెలను పరిశీలించగా అందులో 54 బంగారు ఆభరణాలు.. మొత్తం 2.42 కేజీల బంగారం, 280 వెండి సామగ్రితో పాటు మొత్తంగా 84.10 కేజీల వెండి, రూ.15,55,560 నగదు , రూ.49.10 లక్షల విలువైన 24 ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌/ఎన్‌ఎస్‌ఎస్‌ బాండ్లు, రూ.27.05 లక్షల విలువైన 145 ప్రాంసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మూడు పిస్తోళ్లు, 18 రౌండ్లు, ఒక ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా బీకేఎస్‌లో ఉన్న మనోజ్‌ వ్యవసాయ క్షేత్రాన్ని పోలీసు బృందాలు పరిశీలించగా.. అక్కడ రెండు మహీంద్ర ఎక్స్‌యూవీ టాప్‌ మోడల్‌ కార్లు, ఒక హార్డీ డేవిడ్‌ సన్‌ మోటర్‌ వాహనం, మూడు ఎన్‌ఫీల్డ్‌ ద్విచక్ర వాహనాలు, రెండు కరీజ్మా ద్విచక్ర వాహనాలు, ఒక హోండా యాక్టివా, నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న డమ్మీ పిస్తోళ్లు.. 

అవన్నీ డమ్మీ పిస్తోళ్లే 
పోలీసుల సోదాల్లో మూడు పిస్తోళ్లు, ఒక ఎయిర్‌గన్‌ స్వాధీనం చేసుకున్నామని, అవన్నీ డమ్మీవేనని ఓఎస్‌డీ వెల్లడించారు. పిస్తోళ్లతో పాటు 16 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్చినప్పుడు వాటి నుంచి ఫైర్, సౌండ్‌ మాత్రమే వస్తాయనీ, వీటితో షూట్‌ చేసినా ఎవరికీ ప్రాణహాని ఉండదని తెలిపారు. 

కేసు నమోదు 
భారీ మొత్తంలో ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ప్రామిసరీ నోట్లు కలిగి ఉండడంతో మనోజ్‌కుమార్‌పై సీఆర్‌ నం 213/2020,యు/ఎస్‌ 102 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేశామని ఓఎస్‌డీ వివరించారు. కేసు చేధింపులో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు ఎస్పీ బి.సత్యయేసు బాబు అభినందించి రివార్డులు ప్రకటించారన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, ఈ.శ్రీనివాసులు, ఏ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, సీఐలు సాయిప్రసాద్, శ్యాంరావు, ఎస్‌ఐ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

డీజీపీ దృష్టికి మనోజ్‌ వ్యవహారం 
చిరు ఉద్యోగి మనోజ్‌ భారీగా నగదు, నగలు దాచుకోవడం...పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్న అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ సత్యయేసుబాబు డీజీపీ గౌతం సవాంగ్‌కు నివేదిక సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక మనోజ్‌ అక్రమాస్తులపై ఏసీబీ కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. 

ముందే చెప్పిన ‘సాక్షి’
జిల్లా ఖజానా కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందనీ, ముడుపులిస్తే కానీ ఫైళ్లు ముందుకు కదలవని ‘సాక్షి’ ఈ ఏడాది మే 21న ‘ముడుపుల ఖజానా’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. అవినీతి తతంగంలో తెర వెనుక ఇద్దరు ఉద్యోగులున్నారని, అందులో సీనియర్‌ అకౌంటెంట్‌ మనోజ్‌ కీలకపాత్ర పోషించినట్లు పేర్కొంది. ఉద్యోగులకు డీఏ, అరియర్స్‌ విషయంలోనూ సదరు సీనియర్‌ అకౌంటెంట్‌ భారీ స్థాయిలో దందాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయని, వీటితో పాటు కార్యాలయంలో ఎవరికైనా మెమో, షోకాజ్‌ తదితర నోటీసులిస్తే సమాధానం అతనే రాసి వారితో సొమ్ము చేసుకుంటున్నారని మే నెలలో ప్రచురించిన కథనంలో ‘సాక్షి’ పేర్కొంది.

‘సాక్షి’లో ప్రచురితమైన కథనం..     

మరిన్ని వార్తలు