ఏబీవీ అక్రమాలపై విచారణ తుది దశకు

5 Apr, 2021 03:30 IST|Sakshi

నెలాఖరుకల్లా నివేదిక సిద్ధం

14 రోజులుగా కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సిసోడియా విచారణ

సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో నిబంధనలకు పాతరేసి అక్రమాలకు పాల్పడం ద్వారా దేశ ద్రోహానికి ఒడిగట్టారనే అభియోగంపై సస్పెన్షన్‌కు గురైన రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)పై విచారణ తుది దశకు చేరింది. సెలవు రోజైన ఆదివారం కూడా వెలగపూడి సచివాలయంలో ఈ విచారణ కొనసాగింది. ఏబీవీ అక్రమాలపై శాఖాపరమైన విచారణను గత నెల 18న కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సిసోసియా చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం 22 నుంచి రోజూ కొనసాగింది. 14 రోజులపాటు సాగిన ఈ విచారణలో 21 మందికి పైగా సాక్షులను విచారించి వారిచ్చిన స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. తనపై వచ్చిన అభియోగాలకు వివరణ ఇచ్చేందుకు ఏబీవీ రోజువారీగా హాజరు కాగా, మాజీ డీజీపీలు, పలువురు ఐపీఎస్‌లు హాజరై సాక్ష్యం ఇచ్చారు.

సాక్షులుగా మాజీ డీజీపీలు జేవీ రాముడు, నండూరి సాంబశివరావు, ఎం.మాలకొండయ్య, ఆర్పీ ఠాకూర్‌ హాజరై వివరణ ఇచ్చినట్లు సమాచారం. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఎన్‌వీ సురేంద్రబాబు, సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, రవిశంకర్‌ అయ్యన్నార్‌ తదితరులూ హాజరయ్యారు. కాగా, ఏబీవీపై శాఖాపరమైన విచారణను ఈ ఏడాది ఏప్రిల్‌ నెలాఖరులోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రోజువారీ విచారణను చేపట్టి మే 3లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ చేపట్టే విచారణను ఎలక్ట్రానిక్‌ మీడియా సమక్షంలో చేపట్టాలని ఏబీవీ కోరారు. కానీ, జ్యూడీషియల్‌ సంస్థగా కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ విచారణ గోప్యంగానే జరుగుతుందని స్పష్టంచేసింది. మరోవైపు.. ఈ నెలాఖరు నాటికి నివేదిక సిద్ధంకానుంది. మే 3లోగా దానిని సమర్పించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 

సాక్షులను నేను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశా : ఏబీవీ
కాగా, సచివాలయంలో ఆదివారం కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ విచారణకు హాజరైన ఏబీవీ.. తర్వాత మీడియాతో మాట్లాడారు. తనపై జరిగినా విచారణలో 21 మంది సాక్షులను తానే క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశానన్నారు. అల్పులు, అథములు, కుక్కమూతి పిందెలు, చట్టాలు తెలియని వాళ్లు తనపై ఆరోపణలు చేశారని.. కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించి తనను ఇరికించే ప్రయత్నం చేశారని ఏబీవీ ఆరోపించారు. 

మరిన్ని వార్తలు