దొంగతనం ఆరోపణతో ఆదివాసి హత్య

29 Aug, 2021 06:04 IST|Sakshi

భోపాల్‌: దొంగతనం అభియోగాలపై ఒక ఆదివాసిని ఎనిమిది మంది తీవ్రంగా హింసించి చంపిన అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ జిల్లాలో జరిగింది. కన్హయలాల్‌ భీల్‌(40)అనే ఆదివాసిని చితార్‌మల్‌ గుర్జార్‌ అనే పాల వ్యాపారి బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో గుర్జార్‌ పాలు నేలపాలయ్యాయి. దీంతో కన్హయలాల్‌ కావాలనే తన బండికి అడ్డువచ్చాడని ఆరోపిస్తూ తన స్నేహితులను పిలిచి కన్హయపై గుర్జార్‌ దాడి చేశాడని పోలీసులు తెలిపారు. కన్హయలాల్‌ను తీవ్రంగా కొట్టి అనంతరం ఒక వాహనం వెనుక తాడుతో కట్టి ఈడ్చుకుపోయారని తెలిపారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియా లో ఉంచడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కన్హయను ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం కన్హయ గాయాల కారణంగా మరణించాడు. ఈ ఘటనపై గుర్జార్‌తో పాటు మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఎస్‌పీ సూరజ్‌ కుమార్‌ తెలిపారు. గుర్జార్‌కు చెందిన మోటార్‌సైకిల్‌ను, కన్హయను కట్టేసిన వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు