కొండపల్లి ‘పోడుభూమి’ రణరంగం

11 Apr, 2021 04:12 IST|Sakshi
దీక్ష శిబిరం వద్ద కారంపొడి పొట్లాలు

గిరిజన రైతులకు మద్దతుగా బీజేపీ నిరవధిక దీక్ష 

అర్ధరాత్రి దీక్షను భగ్నం చేసిన పోలీసులు 

పోడు రైతులు, మహిళలు, పోలీసుల మధ్య తోపులాట 

రాళ్ల దాడిలో సీఐ, ఎస్‌ఐతోపాటు కానిస్టేబుళ్లకు గాయాలు 

పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన రైతులు, బీజేపీ నాయకులు

సాక్షి, పెంచికల్‌పేట్‌: కొండపల్లి ‘పోడుభూమి’రణరంగమైంది. గిరిజనులకు, పోలీసులకు మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. పోలీసులపైకి గిరిజన రైతులు, మహిళలు రాళ్ల దాడి చేశారు. పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట మండలం కొండపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అటవీ భూముల్లో ప్లాంటేషన్‌ నిలిపివేయాలని, పోడు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేత పాల్వాయి హరీశ్‌బాబు రెండురోజులుగా నిరవధిక దీక్ష చేపట్టారు. అర్ధరాత్రి దీక్షా శిబిరం వద్దకు జిల్లాస్థాయి అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.హరీశ్‌బాబుతోపాటు పార్టీ జిల్లా కార్యదర్శి కొంగ సత్యనారాయణను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించడంతో మహిళలు, రైతులు తిరగబడి రాళ్ల దాడికి దిగారు. దీంతో కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ, పెంచికల్‌పేట్‌ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. 

పోలీసులను అడ్డుకున్న గ్రామస్తులు 
హరీశ్‌బాబును రెబ్బెన వైపు వాహనంలో తరలించగా.. మరో పోలీసు అధికారుల బృందం కొండపల్లి మీదుగా పెంచికల్‌పేట్‌ చేరుకోవటానికి బయలుదేరింది. దీంతో కొండపల్లి పొలిమేర్లలో పోలీసుల వాహనాలను మహిళలు అడ్డుకున్నారు. హరీశ్‌బాబును విడిచిపెట్టాలని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం వేకువజాము 4 గంటల వరకూ పోలీసులను ఘెరావ్‌ చేశారు. ఆసిఫాబాద్‌ ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు అదనపు పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.  


గాయపడిన మహిళా కానిస్టేబుల్స్‌ తిరుపతిబాయి, కోమలి  

రెబ్బెనలో పోలీసు వాహనాల అడ్డగింపు 
బెజ్జూర్‌ మండలం రెబ్బెన గ్రామం మీదుగా పోలీసులు హరీశ్‌బాబును తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న గ్రామస్తులు అదే రాత్రి 12 గంటల సమయంలో పెద్దసంఖ్యలో రోడ్డుకు అడ్డుగా నిలిచారు. పోలీసు వాహనాలను ఆపేసి టైర్లలో గాలిని తీసేశారు. వాహనంలో ఉన్న హరీశ్‌బాబును తీసుకునివెళ్లారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారని, మహిళల కళ్లలో కారం చల్లి ఇష్టారీతిన వ్యవహరించారని హరీశ్‌బాబు విమర్శించారు.

పలువురిపై కేసు నమోదు  
కొండపల్లిలో పోలీసులపై దాడికి పాల్పడి, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పెంచికల్‌పేట ఎస్సై రమేశ్‌ తెలి పారు. బీజేపీ నేతలు పోలీసుల కళ్లలో కారంకొట్టి దాడి చేశారని, కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ, ఎస్సై, ఇద్దరు మహిళాకానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఆరు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారని, దాడులకు పాల్పడిన వారిపై కేసు నమెదు చేశామని వివరించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు