ఎమ్మెల్యే భార్యను దోచేసిన దొంగలు.. తక్‌, తక్‌ గ్యాంగ్‌ పనేనా?

24 Jul, 2021 10:24 IST|Sakshi
చోరీలకు పాల్పడుతున్న తక్‌ తక్‌ గ్యాంగ్‌( ఫైల్‌ ఫొటోలు)

న్యూఢిల్లీ :  తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భార్యను దోచేశారు కొందరు దొంగలు. పక్కా ప్లాన్‌ వేసి రెండు లక్షల నగదు, ఓ గోల్డ్‌ కాయిన్‌, ఐఫోన్‌, డాక్యుమెంట్లు కొట్టేశారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్‌కతా, జోరసకో నియోజకవర్గ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వివేక్‌ గుప్తా న్యూఢిల్లీ, లోధి కాలనీలోని ఓ హోటల్‌లో గత కొద్ది రోజులనుంచి ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వివేక్‌ భార్య కారులో బయటకు వెళ్లింది. 2.15 ప్రాంతంలో డిఫెన్స్‌ కాలనీ ఫ్లైఓవర్‌ వద్ద కారు వెళుతోంది. ఈ సమయంలో మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారును సమీపించి టైరును చూపిస్తూ ఏదో చెప్పారు.

దీంతో డ్రైవర్‌ టైరులో ఏదో సమస్య ఉందని భావించి కారు ఆపాడు. అనంతరం మరో మోటారు సైకిల్‌పై వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు కారు బోనోట్‌ చూపించారు. డ్రైవర్‌ కారు బోనోట్‌ దగ్గరకు వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత వివేక్‌ భార్య ఉక్కపోత భరించలేక కారులోంచి బయటకు వచ్చింది. ఇదే అదనుగా భావించిన మోటారు సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు కారులోని రెండు లక్షల నగదు, ఐ ఫోన్‌, గోల్డ్‌ కాయిన్‌, డాక్యుమెంట్లు కొట్టేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది తక్‌.. తక్‌ గ్యాంగ్‌ పనేనని అనుమానిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు