Covid 19: బెడ్డు కోసం రూ.1.20 లక్షల ముడుపు

7 May, 2021 10:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి/కర్ణాటక: ప్రైవేటు ఆసుపత్రిలో తల్లికి బెడ్‌ ఇవ్వడానికి కుమారుని నుంచి రూ.1.20 లక్షల లంచం తీసుకున్న ఆరోగ్య మిత్ర ఉద్యోగి పునీత్, ప్రైవేటు ఆస్పత్రి ఉద్యోగులు మంజునాథ్, వెంకటసుబ్బారావ్‌ అనే ముగ్గురిని సదాశివనగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ వ్యక్తి తన తల్లికి కరోనా సోకడంతో నెలమంగల పీపుల్‌ట్రీ ఆస్పత్రికి తీసుకెళ్లగా బెడ్‌ లేదని చెప్పారు. ఈ సమయంలో పై ముగ్గురు కలిసి డబ్బు ఇస్తే బెడ్డు ఇప్పిస్తామనడంతో రూ.1.20 లక్షలను వారికి ఇచ్చాడు. ఆ వెంటనే ఐసీయూలో చేర్పించారు. అయితే కొంతసేపటికే ఆమె చనిపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది.    

బెడ్డు కోసం లంచమిచ్చా: మాజీ ఎమ్మెల్యే
తుమకూరు: కరోనా రోగం వస్తే డబ్బులు ఉండాలి, లేకపోతే వారికి బెడ్లు, ఆక్సిజన్‌ దొరకవు, నా బంధువులకు వీటి కోసం ముడుపులు ఇచ్చానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేష్‌ గౌడ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ కరోనా పేరుతో అవినీతి తాండవిస్తోందని, డబ్బులు ఇవ్వకుంటే చికిత్స దొరకడం లేదన్నారు. బెంగళూరులో తమ బంధువుకు ఎన్ని ఆస్పత్రులు తిరిగినా బెడ్‌ దొరకక ఇబ్బంది పడుతుంటే నేను రూ. 20 వేలు లంచమిచ్చి బెడ్‌ ఇప్పించా. రాష్ట్రంలో డబ్బులు లేకపోతే ఎక్కడా వైద్యం దొరకదని ఆరోపించారు.

చదవండి: తండ్రీకొడుకుపై కరోనా పగ.. రోజు వ్యవధిలో ఇద్దరూ మృతి

మరిన్ని వార్తలు