ఎమ్మెల్యేలకు ఎర కేసు.. కేరళలో ముగ్గురి అరెస్ట్‌? 

16 Nov, 2022 00:58 IST|Sakshi

ఓ వైద్యుడితో సహా, మరో ఇద్దరిని విచారిస్తున్న పోలీసులు 

నేడో, రేపో హైదరాబాద్‌కు తరలింపు

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెట్టిన కేసులో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం (సిట్‌) అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి మధ్యవర్తిగా వ్యవహరించిన కేరళలోని కొచ్చికి చెందిన వైద్యుడితో సహా ఆయన ఇద్దరు సహాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

కొన్ని రోజులుగా కేరళలోనే మకాం వేసి, విస్తృతంగా తనిఖీలు చేస్తున్న సిట్‌ బృందంలో తెలంగాణ కేడర్‌కు చెందిన ఓ కేరళ ఐపీఎస్‌ అధికారి కూడా ఉన్నట్లు సమాచారం. కేరళలో అదుపులో ఉన్న ఈ ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. కాల్‌డేటా, బ్యాంక్‌ ఖాతాలను నిశితంగా పరిశీలించగా.. కొన్ని అనధికారిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

ఆయా లావాదేవీలపై వారిని ప్రశ్నించగా.. సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో ఒకట్రెండు రోజుల్లో వారిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి, విచారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గత నెల 26న మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌ రెడ్డిలతో రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలు ప్రలోభాల చర్చలు జరుపుతున్న సమయంలో పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇతర రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు హైదరాబాద్‌కు వచ్చాక న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. 

ముందు పరారీ.. 
రామచంద్రభారతి నెట్‌వర్క్‌పై సిట్‌ బృందం ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే హరియాణా, కర్ణాటకలో రామచంద్రభారతికి చెందిన ఇళ్లు, ఆశ్రమాలపై సోదాలు జరిపి కీలక సమాచారాన్ని సేకరించింది. దాని ఆధారంగా కొచ్చికి చెందిన ఓ వైద్యుడు.. రామచంద్రభారతి, తుషార్‌కు మధ్యవర్తిత్వం వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సిట్‌ బృందం కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి వెళ్లగా.. ఈ సమాచారం అందుకున్న వైద్యుడు ఆసుపత్రి ప్రాంగణంలోని తన క్వార్టర్స్‌ నుంచి పరారైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

దీంతో సహాయకులను విచారించి ఇంటి చిరునామా, ఇతరత్రా వివరాలను తీసుకొని అక్కడికి వెళ్లగా అక్కడి నుంచి కూడా పరారైనట్లు తెలిసింది. దీంతో సిట్‌ బృందం అక్కడే మకాం వేసి, స్థానిక పోలీసుల సహాయంతో వైద్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు