మరో 'కోటి'గారు దొరికారు!

10 Sep, 2020 05:22 IST|Sakshi
మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు

మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్,ఆర్డీవో అరుణారెడ్డి లంచావతారం బట్టబయలు 

అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించిన బాధితుడు 

112 ఎకరాలకు ఎన్‌వోసీ కోసం రూ.1.12 కోట్ల డిమాండ్‌ 

వివిధ దశల్లో ముట్టిన రూ.40 లక్షలు.. 

ఏసీ, ఆర్డీవోతోపాటు మరో ముగ్గురి అరెస్ట్‌ 

ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ రమణకుమార్‌ వెల్లడి 

సాక్షి, మెదక్‌: రెవెన్యూ విభాగంలో వేళ్లూనుకున్న అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతోపాటు నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. అయితే ఇదే రోజు మెదక్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ (ఏసీ) నగేశ్‌ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం.. లంచావతారమెత్తిన సదరు అధికారి భారీ డీల్‌ వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అవినీతి బాగోతంలో ఏసీతోపాటు నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్‌ సత్తార్, సర్వేల్యాండ్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ వాసిం అహ్మద్‌ను రాత్రి అరెస్ట్‌ చేశారు. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ రమణకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 

అవినీతి బాగోతం ఇలా..  
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో 112.21 ఎకరాల వ్యవసాయ భూమికి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్‌వోసీ) కో సం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి ఇటీవల అడిషనల్‌ కలెక్టర్‌ (ఏసీ) నగేశ్‌ను ఆశ్రయించాడు. ఎకరాకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.12 కోట్లు ఇవ్వాలని ఏసీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వివిధ దశల్లో ఇప్పటివరకు రూ.40 లక్షలు ముట్టినవి. మిగిలిన రూ.72 లక్షలకు బదులుగా ఐదెకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించినా పని ముందుకు కదలకపోవడంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.  

12 బృందాలు.. 12 చోట్ల దాడులు 
బాధితుడి ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో ఆరా తీసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం రంగంలోకి దిగారు. 12 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 12 చో ట్ల సోదాలు నిర్వహించారు. ఏసీ నివాసముం టున్న మెదక్‌ జిల్లా మాచవరంతోపాటు కొం పల్లిలోని ఆయన స్వగృహంలో, భూబాగోతానికి సంబంధించి నర్సాపూర్‌ ఆర్డీవో కార్యాల యం, క్యాంప్‌ ఆఫీస్‌లో.. ఘట్కేసర్‌లోని ఆర్డీవో అరుణ నివాసంలో, సంగారెడ్డిలోని చిలప్‌చెడ్‌ తహసీల్దార్‌ సత్తార్‌ నివాసంలో తనిఖీలు చేపట్టారు. మాచవరంలోని ఏసీ ఇంట్లో ఉదయం 7 గంటలకు తనిఖీలు ప్రారంభం కాగా.. రాత్రి 10 తర్వాత కూడా కొనసాగుతున్నాయి. 

ఏసీ ఇంట్లో 8 చెక్కులు.. ఆర్డీవో నివాసంలో రూ.28 లక్షలు  
మాచవరంలోని అదనపు కలెక్టర్‌ ఇంట్లో సోదాల సందర్భంగా లింగమూర్తి సైన్‌ చేసిన ఎనిమిది చెక్కులు, పలు కీలక డాక్యుమెంట్లు లభించాయి. మరోవైపు అడిషనల్‌ కలెక్టర్‌ భార్య మమతను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో ఉన్న బ్యాంక్‌ లాకర్‌ను తెరిచేందుకు ఆమెను తీసుకెళ్లారు. మరోవైపు ఘట్‌కేసర్‌ మండలంలోని చౌదరిగూడ వెంకటసాయినగర్‌ ఫేజ్‌ 1లోని నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో లెక్కలోకి రాని రూ.28 లక్షలు, అరకిలో బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. వీటిని ఏసీబీ అధికారులు సీజ్‌ చేశారు. నర్సాపూర్‌ ఆర్‌డీవో ఆఫీసుతోపాటు ఆర్‌డీవో క్యాంపు కార్యాల యంలో ఏసీబీ అధికారులు బుధవారం ఉద యం నుంచి తనిఖీలు చేపట్టారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి చిప్పల్‌తుర్తికి చెందిన భూముల రికార్డులను అక్కడికి తెప్పించడంతో పాటు తహసీల్దార్‌ మాలతిని అక్కడికి పిలిపించి విచారణ చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి ఏసీబీ అధికారులు ఆర్‌డీఓ అరుణారెడ్డిని తమ వెంట తీసుకుని ఆర్‌డీఓ ఆఫీసుకు వెళ్లి పలురికార్డులను తనిఖీ చేశారు. 

ఆయాసం.. వైద్యుల రాక 
మాచవరంలోని ఇంట్లో సోదాలు జరుపుతున్న క్రమంలో ఏసీ నగేశ్‌ ఆయాసంతో ఇబ్బంది పడ్డారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సాయంత్రం 6 గంటల సమయంలో ప్రైవేట్‌ వైద్యులు వచ్చి పరీక్షించారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణను ప్రశ్నించగా ప్రస్తు తం ఆయన బాగానే ఉన్నారని చెప్పారు. సో దాలు కొనసాగుతుండగానే అదనపు కలెక్టర్‌ నగేశ్‌తోపాటు నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారె డ్డి, చిలప్‌చెడ్‌ ఎమ్మార్వో సత్తార్, సర్వేల్యాండ్‌ రికార్డ్స్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ వాసిం అహ్మద్, ఏసీకి బినామీగా వ్యవహరించిన జీవన్‌గౌడ్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. మా చవరంలో అదనపు కలెక్టర్‌ను, హైదరాబాద్‌ లో ఆర్డీవో, ఏసీ బినామీ, సంగారెడ్డిలో ఎమ్మార్వోతోపాటు సర్వేల్యాండ్‌ రికార్డ్స్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ను అరెస్ట్‌ చేశారు. ఏసీబీ ప్రత్యేక జడ్జి ఎదుట వారిని హాజరుపరచనున్నారు.   

ఫిర్యాదు.. ఆ తర్వాత ఇలా.. 
► ఈ ఏడాది ఫిబ్రవరి 29న శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి మరో నలుగురు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలంలోని చిప్పల్‌తుర్తి గ్రామంలో ఉన్న సర్వే నంబర్‌ 59/31, 59/40, 58/1, 58/2లో ఉన్న 112.21 ఎకరాల భూమి ని కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు.  
► జూలై 21న సదరు భూమికి సంబంధించి ఎన్‌వోసీ కోసం నర్సాపూర్‌ తహసీల్దార్‌ సత్తార్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అదే నెల 23న సదరు అధికారి ఆర్డీవో అరుణారెడ్డికి పంపించాడు. ఆ తర్వాత అదే నెల 25న సదరు అధికారిణి ఈ దరఖాస్తును కలెక్టర్‌కు ఫార్వర్డ్‌ చేశారు. 
► ఇక ఆ తర్వాత అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌ రంగంలోకి దిగాడు. ఎకరాకు రూ.లక్ష చొప్పున 112 ఎకరాలకు రూ.1.12 కో ట్లు ఇవ్వాలని లింగమూర్తితో జూలై 31న ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పం దం మేరకు అదేరోజు ఏసీకి తొలి విడతలో రూ.19.05 లక్షలు అందజేశాడు. అనంతరం ఆగస్టు 7న మరో రూ.20.05 లక్షలు ఇచ్చాడు. రెండు విడతల్లో అదన పు కలెక్టర్‌కు రూ.40 లక్షలు ముట్టాయి. 
► అయితే మిగిలిన రూ.72 లక్షలు ఇవ్వడంలో జాప్యం జరగడంతో అడిషనల్‌ కలెక్టర్‌ తనకు నమ్మకం లేదంటూ లింగమూర్తి కొనుగోలు చేసిన భూమిలో ఐదు ఎకరాలు తనకు సంబంధించిన బినామీకి అమ్మినట్లు ఆగస్టు 21న అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. సికింద్రాబాద్‌కు చెందిన కోల జీవన్‌గౌడ్‌ (ఏసీ బినామీ)కు అమ్మినట్లు ఒప్పంద పత్రం రాయించాడు. దీంతోపాటు లింగమూర్తి సంతకం చేసిన 8 బ్లాంక్‌ చెక్‌లను ష్యూరిటీ కింద తీసుకున్నాడు. 
► జూలై 31న అదనపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు లింగమూర్తి నుంచి సర్వేల్యాండ్‌ రికార్డ్స్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ వాసిం అహ్మద్‌ రూ.5 లక్షలు తీసుకొన్నారు. అదేవిధంగా ఆర్డీవో అరుణారెడ్డి, చిలప్‌చెడ్‌ తహసీల్దార్‌ సత్తార్‌కు లక్ష చొప్పున ముట్టాయి.  

కొత్త చట్టంతో బేరం బెడిసికొట్టింది..
112 ఎకరాల వ్యవసాయ పొలం.. ఎన్‌వోసీ ఎకరానికి లక్ష చొప్పున మొత్తం రూ.1.12 కోట్ల బేరం కుదిరింది. అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌ నుంచి వీఆర్‌ఏ దాకా అంతా అనుకూలంగా పనిచేసేందుకు రూ.40 లక్షల నగదు, మరో రూ.72 లక్షల విలువ చేసే స్థలం అడిషనల్‌ కలెక్టర్‌కు అదనపు బహుమతి.. అంతా బానే ఉంది. వాస్తవానికి ఈ డీల్‌ దాదాపు గా పూర్తికావొచ్చింది. కానీ, ఆఖరు నిమి షంలో ఏదో తేడా వచ్చింది. అధికారులపై ఫిర్యాదుదారుడికి ఎందుకు అనుమానమొచ్చింది? అందరి మదిలోనూ ఇదే ప్రశ్న. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఈ మొత్తం డీల్‌ రద్దవడానికి, రద్దయిన డీల్‌ వ్యవహారం అవినీతి నిరోధకశాఖ దాకా వెళ్లడానికి అసలైన కారణం కొత్త చట్టమే అని సమాచారం.

కొత్తచట్టంలో అధికారాలకు కోత పెడుతున్నారన్న ప్రచారమే రెవె న్యూ అధికారులను ఏసీబీకి పట్టించిందని సమాచారం. బాధితుడు తన పనికోసం అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నా.. వా రు పని నెమ్మదిగా చేయసాగారు. ఈలోపు అసెంబ్లీ సమావేశాలు ఖరారు కావడం, తొ లిరోజే కేబినెట్‌ సమావేశంలో రెవెన్యూ చట్టానికి ఆమోదం తెలపడంతో బాధితుల్లో అధికారుల తీరుపై అనుమానాలు చెలరేగా యి. అధికారులు ఈ పని చేసినా.. చెల్లుబా టు అవుతుందా? అన్న అనుమానాలు రో జురోజుకూ పెరిగిపోయాయి. కానీ, ఈ వ్య వహారంతో సంబం«ధమున్న అధికారులు మాత్రం పనిపై ధీమాగానే ఉన్నారు. అయి తే, మంగళవారం వీఆర్వో వ్యవస్థ రద్దు కా వడం, భూరికార్డులు స్వాధీనం చేసుకోవడంతో బాధితులకు ఈ పని కాద ని తేలిపోయింది. అందుకే, తాను అధికారులతో మాట్లాడిన ఆడియోటేపులు, చెక్కులు, డాక్యుమెంట్లు తీసుకుని నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించాడని సమాచారం.   

మరిన్ని వార్తలు