భార్యను కాల్‌ గర్ల్‌గా చిత్రించి..

31 Dec, 2020 06:07 IST|Sakshi
ఆందోళన చేస్తున్న నిరోషా

అదనపు కట్నం కోసం టీటీడీ ఉద్యోగి దాష్టీకం

తిరుపతి క్రైం/సాక్షి,అమరావతి: అదనపు కట్నం కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మానసికంగా హింసించాడు. భౌతికంగా వేధింపులకు దిగాడు. తన హింసను భరిస్తూ వస్తున్న భార్యను చివరకు కాల్‌ గర్ల్‌లా చిత్రించాడు. వెబ్‌సైట్లలో తాను భార్యతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఉంచి తనలో క్రూరత్వాన్ని బయటపెట్టాడు. వేధింపులను తట్టుకోలేకపోయిన భార్య ఎదురుతిరిగింది. పోలీసులకు సమాచారం అందడంతో నిందితుడిని అరెస్టు చేశారు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. టీటీడీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తిమ్మినాయుడుపాళెంకు చెందిన రేవంత్‌ నాలుగు నెలల క్రితం నిరోషాను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నాడు.

పెళ్లి సందర్భంగా అమ్మాయి తల్లిదండ్రులు రూ. 10 లక్షల విలువైన బంగారం, రూ. 10 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లయిన కొద్ది రోజుల తర్వాత నుంచే అదనపు కట్నం తేవాలని భార్యను రేవంత్‌ వేధించడం మొదలుపెట్టాడు. భౌతికదాడులు చేశాడు. అంతేగాక తన భార్యతో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలను, వీడియోలను వెబ్‌సైట్లలో ఉంచి ఆమెను కాల్‌గర్ల్‌గా చిత్రీకరించాడు. భర్త వేధింపులను నిరోషా తాళలేక ఎదురుతిరిగింది. ఆమెకు అండగా బంధువులు, స్థానికులు నిలబడ్డారు. రేవంత్‌ ఇంటికి వారు వచ్చేలోపు సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరోషాకు మద్దుతుగా వచ్చిన వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితురాలు నిరోషాతో అర్బన్‌ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పటికే దిశా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

మహిళా కమిషన్‌ సీరియస్‌
భార్యను కాల్‌ గర్ల్‌గా చిత్రించిన ఘటనపై మహిళా కమిషన్‌ సీరియస్‌ అయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కోరారు. బాధితురాలితో మాట్లాడి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.   

మరిన్ని వార్తలు