ట్యూషన్‌ మాస్టర్‌ ప్రేమ..పెళ్లికి నిరాకరించడంతో

29 May, 2021 12:32 IST|Sakshi

కంటోన్మెంట్‌: ట్యూషన్‌ చెప్పేందుకు వచ్చి ప్రేమలో పడేసిన యువకుడు తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి మొహం చాటేశాడు. దీనికి తోడు తన తల్లిదండ్రులను సైతం అవమానించడంతో మనస్తాపానికి గురైన యువతి, మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్రగాయాలపాలైన యువతిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతోకట్టా తిరుమల అపార్ట్‌మెంట్‌ వాసి నర్సింహులు కూతురు శైలజ(23) బీటెక్‌ చదువుతోంది. వీరి ఎదురు ఫ్లాట్‌లో ఉండే పవన్‌ కల్యాణ్‌ అలియాస్‌ సన్ని(25) ఆమెకు ట్యూషన్‌ చెప్పేవాడు.

ఈ క్రమంలో ఇరువురు ప్రేమలో పడ్డారు. ఇదే విషయాన్ని శైలజ తన తల్లిదండ్రులకు చెప్పడంతో, పవన్‌ కళ్యాణ్‌ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు వెళ్లారు. ఇరువురి పెళ్లి ప్రస్తావనను తిరస్కరించిన పవన్‌ కళ్యాణ్‌ తల్లిదండ్రులు, శైలజ తల్లిదండ్రులను కులం పేరిట దూషించారు. తర్వాత కొన్ని రోజులకు శైలజ ఇంట్లో ఎవరూలేని సమయంలో వారింట్లోకి వచ్చిన పవన్‌ కళ్యాణ్, ఆమెను చంపేస్తానని బెదిరించాడు.

నెల రోజుల్లోనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని చూపిస్తానని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురై శైలజ ఈ నెల 27న రాత్రి 10.00 గంటల సమయంలో తమ అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన శైలజ పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Lockdown: ఐదు నిమిషాలు ఆలస్యం.. రూ.వెయ్యి ఫైన్‌! 

మరిన్ని వార్తలు