టీవీవీ గౌరవాధ్యక్షుడు రవీందర్‌రావు అరెస్టు

22 Mar, 2021 10:49 IST|Sakshi
రవీందర్‌రావును అరెస్టు చేస్తున్న పోలీసులు 

మావోయిస్టు భావజాలం వ్యాప్తి చేస్తున్నారని అభియోగాలు

నివాసంలో విప్లవ సాహిత్య సీడీలు, సిమ్‌ కార్డులు స్వాధీనం

మావోయిస్టు పార్టీతో నాకే సంబంధం లేదు: రవీందర్‌రావు  

సాక్షి, రామకృష్ణాపూర్‌(చెన్నూర్‌): తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గురిజాల రవీందర్‌రావును పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మావోయిస్టు భావజాల వ్యాప్తి చేస్తున్నారన్న అభియోగాలతో ఆయన స్వగృహం రామకృష్ణాపూర్‌ పరిధి క్యాతనపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 సిమ్‌ కార్డులు, విప్లవ సాహిత్యంతో కూడిన సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రామకృష్ణాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

‘రవీందర్‌రావు టీవీవీ ముసుగులో మావోయిస్టులకు సహకరిస్తున్నారు. రవీందర్‌రావు ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యానికి ఆశ్రయమిచ్చారు. సుబ్రహ్మణ్యం గత నవంబర్‌లో 20 రోజుల పాటు రవీందర్‌రావు ఇంట్లో తలదాచుకున్నాడు. రవీందర్‌రావు మావోయిస్టు కీలక నేతలతో అందుబాటులో ఉంటూ అర్బన్‌ నక్సలిజాన్ని విస్తరింపజేస్తున్నారు. లా అండ్‌ ఆర్డర్, ఇంటెలిజెన్స్‌ పోలీసుల పక్కా సమాచారం మేరకు రవీందర్‌రావు ఇంట్లో సోదాలు నిర్వహించాం. రవీందర్‌రావుపై 120, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నాం..’అని సీపీ తెలిపారు.

పీపుల్స్‌వార్‌లో క్రియాశీలకంగా..
క్యాతనపల్లికి చెందిన రవీందర్‌రావు 1978 నుంచే ర్యాడికల్‌ యూత్‌ వింగ్‌లో పనిచేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. ‘రవీందర్‌రావు ఆ క్రమంలోనే ఎదుగుతూ అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కొన్నాళ్ల అనంతరం సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)లో కీలక బాధ్యతలు చేపట్టారు. కొంతకాలం అజ్ఞాతంలో ఉంటూ పనిచేసి.. రెండు దశాబ్దాల క్రితం లొంగిపోయారు. ప్రస్తుతం టీవీవీని ఆయన ఆసరాగా చేసుకుని మావోయిస్టు భావజాల వ్యాప్తికి హితోధికంగా సహకరిస్తున్నారు..’ అని సీపీ పేర్కొన్నారు.

నాకే సంబంధం లేదు.. అరెస్టు అక్రమం: రవీందర్‌రావు
ఇటు పోలీస్‌స్టేషన్‌లో గురిజాల రవీందర్‌రావు విలే కరులతో మాట్లాడారు.. అకారణంగా తనను పోలీ సులు అరెస్టు చేయడం అక్రమమన్నారు. తాను టీవీవీలో మాత్రమే పనిచేస్తున్నానని, మావోయిస్టు పార్టీతో తనకు సంబంధం లేదని వెల్లడించారు.

చదవండి:  గెలుపు సంబరాల్లో గన్‌తో హల్‌చల్‌

మరిన్ని వార్తలు