ఎయిర్‌ గన్‌ పేలి చిన్నారి మృతి.. కేసులో ట్విస్ట్‌.. జరిగింది ఇదే!

17 Mar, 2022 12:25 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి చెందిన కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారి మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్‌ తెరమీదకొచ్చింది. ఇప్పటి వరకు నాలుగేళ్ల చిన్నారి సాన్వి ఎయిర్‌ గన్‌తో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలడంతో ఆమె కణతలోకి గుండు దూసుకుపోయి చనిపోయిందని అనుకున్నారు. అయితే ఎయిర్ గన్ పేలుడులో చిన్నారిని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఉద్దేశపూర్వకంగానే దగ్గరి నుంచి కాల్చినట్టు పోలీసులు గుర్తించారు. పామ్‌హౌజ్‌లో 17 ఏళ్ల యువకుడు గన్‌తో ఆడుతూ ఫైర్‌ చేయగా అటుగా వెళ్తున్న బాలిక సాన్వీకి పిల్లిట్‌ తగిలినట్లు పోలీసులు తెలిపారు.

కాగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫామ్‌ హౌజ్‌లో ఎయిర్ గన్ పేలి శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప మృతిచెందిన విషయం తెలిసిందే. మరోవైపు మృతిచెందిన చిన్నారి మృతదేహం ఇంకా ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలోనే ఉంది. గురువారం ఆసుపత్రిలో మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసులోని నిందితులను పఠాన్‌ చెరు పోలీస్‌ స్టేషన్‌లో మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఎయిర్ గన్ ఘటనపై డీఎస్పీ భీమ్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
చదవండి: రియల్టర్ల జంట హత్య: ఇబ్రహీంపట్నం ఏసీపీపై వేటు 

‘మార్చి 16న 12 గంటల సమయంలో జిన్నారం పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు వచ్చింది.  ప్రసాద్ ఫామ్ హౌస్‌లో నాగరాజు అనే వ్యక్తి వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. ఆన్ లైన్‌లో రూ. 26 వేలకు ఎయిర్ గన్ ప్రసాద్ కొనుగోలు చేసి నిర్లక్ష్యంగా తన ఫామ్‌హౌజ్‌లో వాచ్‌మెన్‌ గదిలో ఉంచాడు. ఎయిర్ గన్‌కు లైసెన్స్ అవసరం లేదు. నాగరాజు ఇంటికీ బంధువులు వచ్చారు అందులో 17 ఏళ్ళ యువకుడు గన్‌తో అడుతూ ఫైర్ చేశాడు.  దీంతో అటు వైపుగా వస్తున్న 4 ఏళ్ళ బాలికకు పిల్లెట్ తగిలింది. పిల్లెట్ కణతి మీద తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి చెందింది. 17 ఏళ్ళ బాలుడిని,  ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నాం. 109, 176 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశాం’ అని డీఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు