వెండి సింహాల చోరీ కేసును ఛేదించిన పోలీసులు

23 Jan, 2021 18:11 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దుర్గ గుడిలో మూడు వెండి సింహాల ప్రతిమల అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన నిందితుడు సాయిబాబాతో పాటు బంగారం వ్యాపారి కమలేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. గత సంవత్సరం సెఫ్టెంబర్ 17న దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల వెండి రథంలోని నాలుగు వెండి సింహాల్లో మూడు సింహాలు మాయమైనట్లు ఫిర్యాదు అందిందని, కానీ జులైలో దొంగతనం జరిగినట్లు విచారణలో తేలిందన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి150 మందిని  విచారించామని, ఈ కేసులో ప్రధాన నిందితుడు భీమవరం మండలం గొల్లవానిరేవు గ్రామానికి చెందిన సాయిబాబాగా నిర్థారించామని సీపీ పేర్కొన్నారు. గతంలో భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు పట్టణాలలోని ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితుడు సాయిబాబా.. 2012లో చివరిసారిగా పోలీసులకు పట్టుబడ్డాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఆలయాల్లో చోరీలు మొదలుపెట్టాడని సీపీ వెల్లడించారు. సాయితో పాటు బంగారం వ్యాపారి ముత్తా కమలేష్‌ను కూడా అరెస్టు చేశామని, చోరికి గురైన మొత్తం వెండితో పాటు మిగతా ఆలయాల్లో దొంగతనాలకు సంబంధించిన 6.4 కేజీల వెండిని రికవరి చేశామని సీపీ తెలిపారు.

59 వేల దేవాలయాలు జియో ట్యాగింగ్..‌
రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రత పెంచామని సిట్‌ డీఐజీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. 59 వేల దేవాయాలను జియో ట్యాగింగ్‌ చేయడంతో పాటు, 45 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అన్ని చర్యలు చేపట్టినప్పటికి కొంతమంది దురుద్దేశ్యంతో అసత్య ప్రచారం చేస్తున్నారని, వారి పై చర్యలు తీసుకుంటామని డీఐజీ వెల్లడించారు.

మరిన్ని వార్తలు