దిక్కుతోచని స్థితిలో యువతి.. సాయం చేస్తామని చెప్పి..

9 Aug, 2021 09:22 IST|Sakshi
నిందితుడు జాఫర్‌

డ్రాప్‌ చేయమంటే దోచేశారు..

ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు సాయం కోరిన యువతి

స్నేహితుడితో కలిసి మోసం చేసిన హోటల్‌ సిబ్బంది

ఆరు గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు

పెందుర్తి ట్రాఫిక్‌ సీఐని అభినందించిన సీపీ

సాక్షి, విశాఖపట్నం: డ్రాప్‌ చేయమన్న యువతి వద్ద నుంచి బంగారం, డబ్బులు, సెల్‌ఫోన్‌ లాక్కొని పరారైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సంఘటన జరిగిన ఆరు గంటలలోపే నిందితులను పట్టుకొని వారి నుంచి మొత్తం సొత్తు రికవరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. బెంగళూరుకు చెందిన అంజలి బెహ్రా(26) తన ఇద్దరి స్నేహితులతో విశాఖ సందర్శనకు వచ్చింది. వారు ఒక హోటల్‌లో దిగారు.

ఆమె స్నేహితులు శనివారం సాయంత్రం 6.30 గంటలకు వెళ్లిపోయారు. ఈమె రాత్రి 9 గంటలకు విమానంలో బెంగళూరు వెళ్లాల్సి ఉంది. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేందుకు ఆమె హోటల్‌ సిబ్బంది సహాయం కోరింది. అక్కడ పనిచేస్తున్న కళ్యాణ్‌ బైక్‌ మీద ఆమెను ఎయిర్‌పోర్టుకు డ్రాప్‌ చేశాడు. దారిలో ఆ యువతికి తెలియకుండా తన స్నేహితుడు ఎండీ జాఫర్‌ను ఎయిర్‌పోర్ట్‌కి రప్పించాడు.

విమానం మిస్‌ అవ్వడంతో ఏమిచేయాలో దిక్కుతోచక స్థితిలో ఉన్న ఆమెను తిరిగి హోటల్‌కి డ్రాప్‌ చేయమని తన స్నేహితుడికి చెప్పి కళ్యాణ్‌ వెళ్లిపోయాడు. అతడు అడవివరంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె నుంచి డబ్బులు, బంగారం, సెల్‌ఫోన్‌ తీసుకుని పరారయ్యాడు. ఆ రూట్‌లో వస్తున్న వాహన చోదకులు ట్రాఫిక్‌ పోలీసులకు విషయం చెప్పారు.

వెంటనే పెందుర్తి ట్రాఫిక్‌ ఎస్‌ఐ మంతెన భరత్‌కుమార్‌రాజు హుటాహుటిన సిబ్బందితో వెళ్లి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న సీసీ పుటేజీల ద్వారా నిందితులను పట్టుకుని క్రైం పోలీసులకు అప్పగించారు. క్రైం పోలీసులు వారి నుంచి రూ.10 వేలు, బంగారం గొలుసు, రింగు, సెల్‌ఫోన్‌ రికవరీ చేసి యువతికి అందజేశారు. సంఘటన జరిగిన ఆరు గంటలలోనే నిందితులను పట్టుకున్న సిబ్బందిని సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా అభినందించారు. నిందితులను గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నట్లు సీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు