ఎస్‌బీఐ ఏటీఎంకు నిప్పు.. మిషన్‌లోని నగదు ఉందా? కాలిపోయిందా?

14 Aug, 2022 04:28 IST|Sakshi
నిప్పుపెడుతున్న దుండగుడు (సీసీకెమెరా ఫుటేజీ)

వేకువజామున నిప్పుపెట్టిన ఇద్దరు దుండగులు 

రూ.31,91,500 పరిస్థితిపై అనుమానాలు

అనంతపురం క్రైం: అనంతపురంలోని కోర్టు రోడ్డుకు వెళ్లే మార్గంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంకు శనివారం వేకువజామున ఇద్దరు దుండగులు నిప్పుపెట్టారు. ఏటీఎంలో రూ.32 లక్షల నగదు ఉండగా, అందులో రూ.8,500 డ్రా చేసిన అనంతరం పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మిషన్‌లోని రూ.31,91,500 నగదు ఉందా, కాలిపోయిందా అనేది ముంబై నుంచి వచ్చే టెక్నీషియన్‌ తేల్చాల్సి ఉంది.

టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ సీఐ శివరాముడు, ఎస్‌ఐ రాంప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. ఈ ఏటీఎం సెంటర్‌లో 2 మిషన్లు ఉన్నాయి. డబ్బు డ్రా చేసేందుకు శనివారం వేకువజామున 1.58 గంటలకు ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. ఓ వ్యక్తి తలకు టోపీ ధరించాడు. షార్ట్, టీషర్ట్‌తో ఉన్న మరో వ్యక్తి కూడా టోపీ ధరించి ఉన్నాడు.

తమకు కావాల్సిన డబ్బు డ్రా చేసుకున్న తర్వాత నిమిషం వ్యవధిలోనే ఏటీఎంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి వెళ్లిపోయారు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఆంజనేయులు అనే వ్యక్తి గమనించి కొందరి సహాయంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. ఎస్‌బీఐ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ మంగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు