సరదా ఈత.. కన్నవారికి కడుపుకోత!

19 Aug, 2021 14:47 IST|Sakshi

సరదా ఈత రెండు నిండు ప్రాణాల్ని బలిగొంది. చెట్టంత కొడుకుల్ని దూరం చేసి తల్లిదండ్రులకు గర్భ శోకం మిగిల్చింది. మొహర్రం పండుగ ఆనందాన్ని ఆవిరి చేసి ఆ కుటుంబాన్ని దుఃఖ తీరాలకు చేర్చింది. గుండెను పిండేసే ఈ విషాద ఘటన చిన్నమండెం మండలం సద్దలగుట్టపల్లె సమీపంలోని  దేవర చెరువులో జరిగింది.  

చిన్నమండెం: చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్ల గ్రామానికి చెందిన దొరస్వామి నాయక్, లక్ష్మి దేవి కొన్నేళ్ల నుంచి తిరుపతిలో స్థిరనివాసం ఉంటున్నారు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ క్రమంలో దొరస్వామి నాయక్‌ తన ఇద్దరు కుమారులు తరుణ్‌నాయక్‌(18), ఉపేంద్రనాయక్‌(16), కుమార్తెతో కలిసి మొహర్రం పండగ కోసం బంధువులైన  సద్దలగుట్టపల్లెకు చెందిన చంద్రానాయక్‌ ఇంటికి వచ్చారు. పిల్లలందరూ బుధవారం మధ్యాహ్నం భోజనం అనంతరం సరదా కోసం సద్దలగుట్టపల్లెకు సమీపంలో ఉన్న దేవరచెరువు దగ్గరకు వచ్చారు.

తరుణ్, ఉపేంద్ర ఇద్దరూ ఈత కొట్టేందుకు అక్కడే ఉన్న బావిలోకి దూకారు. వారు నీటిలో మునిగిపోయిన విషయాన్ని ఒడ్డు పైనుంచి గమనించిన   చెల్లెలు వెంటనే కుటుంబీకులకు సమాచారం ఇచ్చింది. హుటాహుటిన వారు గ్రామస్తులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులకు, అగ్నిమాపక శాఖాధికారులకూడా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే  నష్టం జరిగిపోయింది. స్థానిక యువకులైన రెడ్డిబాబు, పవన్, కాలీతో కలిసి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.   

మరిన్ని వార్తలు