విషాదం: అంత్యక్రియలకు హాజరై..అనంతలోకాలకు

22 Jun, 2021 19:06 IST|Sakshi

సాక్షి,కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో విషాదం చోటుచేసుకొంది. ఇద్దరు అన్నదమ్ములు చెరువులో మునిగి మృతి చెందారు. యాడారం గ్రామంలో  అంత్యక్రియలకు హాజరై జనగామ శివారులోని బురుకుంట చెరువులో కాళ్లు చేతులు కడుక్కునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతి చెందారు. మృతి చెందిన వారిలో 12 ఏళ్ల బెల్లెడ కార్తీక్ ఒకరు, కాగా మరొకరు 15 ఏళ్ల బెల్లెడ సంతోష్.

తల్లిదండ్రులు రామస్వామి, శ్యామలలతో కలిసి పిల్లలు అంత్యక్రియలకు వెళ్లారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వీరి తల్లిదండ్రులతో పాటు కార్తీక్, సంతోష్ లు చెరువులోకి వెళ్లారు. కాళ్లు కడుక్కునే  క్రమంలో ప్రమాదవశాత్తు జారి అందులో పడి మృతి చెందారు. పిల్లల్ని కనిపెట్టుకుని ఉండకపోవడంతోనే ఘోరం జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

కార్తీక్ జనగామ గ్రామంలో ఆరో తరగతి చదువుతున్నాడు. సంతోష్ బిక్కనూర్లోని రెసిడెన్షియల్లో ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకున్నాడు. అన్నదమ్ములు మృతిచెందడంతో  గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి:విషాదం: అదృశ్యమైన చిన్నారులు చెరువులో శవాలై.

మరిన్ని వార్తలు