కమ్ముకున్న పొగలో కడతేరిన జీవితాలు

30 Mar, 2021 05:07 IST|Sakshi
విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

రెండు బస్సులు, లారీ ఢీకొని ముగ్గురి దుర్మరణం

43 మందికి తీవ్రగాయాలు.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం

వ్యర్థాలకు పెట్టిన పొగతో విజయనగరం జిల్లాలో ప్రమాదం

విజయనగరం క్రైమ్‌/ఫోర్ట్‌/డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): రోడ్డు పక్కన వ్యర్థాలకు నిప్పంటించడంతో కమ్ముకున్న పొగ ముగ్గురి ప్రాణాలు తీసింది. ఈ పొగలో వాహనాలు సరిగా కనిపించకపోవడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు, లారీ ఢీకొన్నాయి. ముగ్గురు దుర్మరణం చెందారు. 43 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ దుర్ఘటన సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండ నుంచి విజయనగరం మీదుగా విశాఖపట్టణం వెళ్తున్న ఆర్టీసీ అల్ట్రా డీలక్స్‌ బస్సు సుంకరిపేట వద్ద  ఖాళీ గ్యాస్‌ సిలెండర్ల లారీని ఓవర్‌ టేక్‌ చేయబోయింది. అక్కడ రోడ్డు పక్కన వ్యర్థాలకు నిప్పంటించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఓవర్‌టేక్‌ చేయబోయిన పాలకొండ బస్సు డ్రైవర్‌కు ఎదురుగా వచ్చే బస్సు కనిపించలేదు.

ఈ బస్సు.. విశాఖ రైల్వేస్టేషన్‌ నుంచి విజయనగరం వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొంది. ఇంతలో వెనుక వస్తున్న లారీ పాలకొండ బస్సును ఢీకొట్టింది. విజయనగరం వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ సాంబార్కి ఆశీర్వాదం (50), ఆ బస్సులో క్యాబిన్‌ వద్ద కూర్చొన్న గంట్యాడ మండలం లక్కిడాం గ్రామానికి చెందిన మరో డ్రైవర్‌ కిలపర్తి దేవుడు (55), పాలకొండ బస్సులో ప్రయాణిస్తున్న పాలకొండ బాసూరు గ్రామానికి చెందిన అలజంగి సన్యాసినాయుడు (45) అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో ఉన్న 55 మంది ప్రయాణికుల్లో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వీరిలో ఐదుగురిని విశాఖపట్నం కేజీహెచ్‌కి, ముగ్గురిని విశాఖపట్నంలో ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

డీఐజీ, ఎస్పీ పరిశీలన
విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు, ఎస్పీ బి.రాజకుమారి ప్రమాదస్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఐదో బెటాలియన్‌ కమాండెంట్‌ జె.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 60 మంది బెటాలియన్‌ పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రత్యేక వాహనం ద్వారా కట్టర్‌లు తెప్పించి బస్సులను విడదీసి గాయపడినవారిని ఆస్పత్రికి పంపారు. ఏఆర్‌ డీఎస్పీ ఎల్‌.శేషాద్రి, పట్టణ డీఎస్పీ అనిల్‌కుమార్, ట్రాఫిక్‌ డీఎస్పీ ఎల్‌.మోహనరావు, ఏఆర్, టాస్క్‌ఫోర్స్‌ బృందాలవారు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. బస్సులను పక్కకు పెట్టించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు విజయనగరం ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడి బాధితుల పరిస్థితి గురించి తెలసుకున్నారు. అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స ఆదేశించారని చెప్పారు. ఈ ప్రమాదంపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ప్రమాదంపై సీఎం జగన్‌ ఆరా..
సాక్షి, అమరావతి: ప్రమాదంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు