బోసినవ్వులు కనుమరుగు: ఏమైందో ఏమో ఒకరితర్వాత ఒకరు..

18 Feb, 2022 07:48 IST|Sakshi
మృతి చెందిన చిన్నారులు రోషణ్‌కుమార్‌దాస్, హీనాకుమారి (ఫైల్‌) 

రాచగున్నేరిలో విషాదఛాయలు 

బోసి నవ్వులు.. చిట్టిపొట్టి మాటలతో ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. తెల్లవారు జామున తమ ఇద్దరి పిల్లలు అస్వస్థతకు గురికావడంతో ఏమైందో తెలియక గందరగోళం ఏర్పడింది. ఆప్తులు ఎవ్వరూ లేకపోయినా చుట్టుపక్కల తెలిసిన వారి సహాయంతో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఏమైందో ఏమోగానీ పిల్లలు ఒకరితర్వాత ఒకరు మృతిచెందడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఊరుగాని ఊర్లో ఏం చేయాలో తెలియక విలపించింది. ఈ ఘటన శ్రీకాళహస్తి మండలం, రాచగున్నేరిలో చూపరులను కంటతడి పెట్టించింది.  

సాక్షి, శ్రీకాళహస్తి రూరల్‌: మండలంలోని రాచగున్నేరి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటన గురువారం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాళహస్తి రూరల్‌ ఎస్‌ఐ వెంకటేష్‌ కథనం మేరకు.. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం, మర్దన్‌ జిల్లా, ఆండాళ్‌ గ్రామానికి చెందిన రమేష్, నీలంకుమారి దంపతులు. రెండేళ్ల కిందట పొట్టచేతబట్టుకుని రాచగున్నేరికి వచ్చారు. వీరికి కుమార్తె హీనాకుమారి(5), కుమారుడు రోషణ్‌కుమార్‌దాస్‌(2) ఉన్నారు. గ్రామానికి సమీపంలోని ఓ ప్రయివేటు కర్మాగారంలో రమేష్‌ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, భార్య ఇంటివద్దే ఉంటోంది. రమేష్‌ బుధవారం విధులకు వెళ్లి ఇంటికి వచ్చాడు. రాత్రి ఆహారం తిని అందరూ నిద్రకు ఉపక్రమించారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో హీనాకుమారి అస్వస్థతకు గురైంది.

చదవండి: (ప్రియుడితో వాగ్వాదం.. యువతి ఆత్మహత్యాయత్నం)

తల్లిదండ్రులు తన కుమారుడుని పక్క ఇంట్లో వదిలిపెట్టి కుమార్తెను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యులు బాలిక అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేసరికి కుమారుడి  పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారడంతో మళ్లీ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రోషణ్‌కుమార్‌దాస్‌ మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరిన ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతికి కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదికలను బట్టి కలుషిత ఆహారమా, మరే ఇతర కారణాలా..? తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. 

వైద్యుల నిర్లక్ష్యం 
చిన్నారులకు పోస్టుమార్టం నిర్వహించకుండానే ఏరియా ఆస్పత్రి వైద్యులు మరణధ్రువీకర పత్రాలు అందజేశారు. ఆపై పోలీసులు వత్తిడి చేయడంతో పోస్టుమార్టం చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు