పెళ్లైన ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం.. పెళ్లికి ఒప్పుకోరని

8 Aug, 2022 12:03 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: వివాహితులైన ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీయగా.. పెళ్లికి  ఇరు కుటుంబాల వారు అంగీకరించరనే మనస్తాపంతో ఇద్దరూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని వినోభానగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై పోటు గణేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వినోభానగర్‌ గ్రామానికి చెందిన తంబారపు ప్రసన్న జ్యోతి(25)కి అదే గ్రామానికి చెందిన కరుణాకర్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విబేధాల నేపథ్యంలో జ్యోతి రెండేళ్లుగా పుట్టింట్లో ఉంటోంది.

ప్రస్తుతం పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం కొత్తగూడెంలో కోచింగ్‌ తీసుకుంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సిరికొండ ప్రశాంత్‌(30) అనే ట్రాలీ, లారీ డ్రైవర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధంగా మారింది. ఈనెల 4న ఉదయం ప్రసన్నజ్యోతి హాల్‌టికెట్‌ తెచ్చుకుంటానని చెప్పి జూలూరుపాడుకు బయలుదేరింది. ఆమెతో పాటు ప్రశాంత్‌ కూడా వెళ్లాడు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో ప్రసన్నజ్యోతి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అదేరోజు ఇద్దరూ పురుగుమందు తాగి ఖమ్మంలోని లారీ అసోసియేషన్‌ కార్యాలయానికి వెళ్లారు.

ఆఫీస్‌లో వాంతులు చేసుకోవడంతో అక్కడున్న వారు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి ఇరు కుటుంబాల వారికి సమాచారం అందించారు. కాగా, ప్రశాంత్‌ శనివారం రాత్రి, ప్రసన్న జ్యోతి ఆదివారం ఉదయం మృతి చెందారు.  ప్రశాంత్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, ప్రసన్న జ్యోతికి భర్త, కుమారుడు ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరి మృతితో వినోభానగర్‌లో విషాదం అలుముకుంది. మృతురాలి తల్లి తంబారపు లలిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు