అల్లుడిపై అత్తింటివారి దాడి.. ఆస్పత్రిపాలైన ఇద్దరు

29 May, 2021 10:49 IST|Sakshi

భార్య ఆత్మహత్యాయత్నం

భర్తను చితకబాదిన అత్తింటివారు

ఆస్పత్రి పాలైన భార్యాభర్తలు

జయపురం: నవరంగపూర్‌ జిల్లా రాయిఘర్‌ సమితి కచరాపర-2 గ్రామానికి చెందిన భార్యాభర్తలు కుటుంబంలో తగవుల కారణంగా ఆస్పత్రి పాలైనట్లు అనుమానిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మనోరంజన్‌కు ఉమ్మరకోట్‌ సమితి గుబురి గ్రామానికి చెందిన  జయంతితో 15 యేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. శుక్రవారం జయంతి విషం తాగి వాంతులు చేసుకుంటుండడం చూసిన భర్త, గ్రామస్తులు వెంటనే రాయిఘర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షించి మందులు ఇచ్చారు.

కొంతసేపటికి ఆరోగ్యం కుదుటపడుతున్న సమయంలో జయంతి తండ్రి హిరెన్‌ మండల్, మరి కొంతమంది బంధువులతో హాస్పిటల్‌కు వచ్చి తన కుమార్తె పరిస్థితికి భర్తే కారకుడని ఆరోపించి దాడి చేసి కొట్టారు. ఈ దెబ్బలకు మనోరంజన్‌ అక్కడే సృహ కోల్పోవడంతో వెంటనే నవరంగపూర్‌ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కుటుంబకలహాలే ఈ పరిస్థితికి కారణమని పోలీసులు, బంధువులు, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసిన రాయిఘర్‌ పోలీసు అధికారి ఠంకుగిరి భొయి సిబ్బందితో రాయిఘర్‌ ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై కేసు నమోదు చేశారు. భార్యాభర్తలు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, వారిని విచారణ చేస్తామని వెల్లడించారు.

 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు