కన్నీరు పెట్టిస్తున్న ఘటన.. ‘మాయమైపోతున్నడమ్మా’

12 Mar, 2023 21:22 IST|Sakshi
హతురాలు కొవ్వూరి సత్యవేణి (ఫైల్‌), తల్లి రాక కోసం ఎదురు చూస్తున్న ఉమామహేశ్వరరెడ్డి

రాయవరం(కోనసీమ జిల్లా): ‘‘మాయమైపోతున్నడమ్మా...మనిషన్న వాడు...మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు’’.. అంటూ తెలంగాణ ప్రజాకవి అందెశ్రీ రాసిన గేయం రాయవరం మండలం మాచవరం సమీపంలో జరిగిన హత్యోదంతాన్ని గుర్తుకు తెస్తోంది. గత నెల 24న కొవ్వూరి సత్యవేణి (54) హత్యకు గురైన విషయం విదితమే. మాచవరం శివారు దేవుడు కాలనీకి చెందిన ఇద్దరు అవివాహిత సోదరులు ఆమెపై తొలుత అత్యాచారం చేసి, ఆనక హత్య చేశారు. ఈ ఘటన హతురాలి కుటుంబాన్నే కాదు హత్యకు పాల్పడిన వారి కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసింది.

గతంలో దేవుడు కాలనీకే చెందిన  అన్నదమ్ములు నల్లమిల్లి ఉమామహేశ్వరరెడ్డి, నల్లమిల్లి వెంకట సత్యనారాయణరెడ్డిలు సత్యవేణిపై అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని ఆమె బయట పెట్టడంతో అన్నదమ్ములు ఆమెపై కక్ష పెంచుకుని, ఈ దురాఘతానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఆ సోదరుల తల్లి నల్లమిల్లి పద్మ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల విచారణలో వాస్తవాలు బయట పడడంతో అన్నదమ్ములు కటకటాల పాలయ్యారు. దాంతో వారి కుటుంబం రోడ్డున పడింది.

హతురాలి కుమారుడి మూగ వే(రో)దన.. 
హతురాలు సత్యవేణి భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్‌రెడ్డి దుబాయ్‌లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. మూగ, చెవిటి వాడైన చిన్న కుమారుడు ఉమామహేశ్వరరెడ్డిని తల్లి సత్యవేణి కంటికిరెప్పలా కాపాడుకుంటోంది. తల్లి సత్యవేణి హత్యకు గురైన విషయం ఉమామహేశ్వరరెడ్డికి తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. 15 రోజులుగా తల్లి కనిపించకపోవడంతో అతడు ఆహారం తీసుకోవడం లేదు. అమ్మ వస్తుందని చెప్పినా వినకుండా  ఒంటరిగా గదిలోనే గడుపుతున్నాడు. ఉమామహేశ్వరరెడ్డిని ఎలా ఊరడించాలో తెలియక తాతయ్య ద్వారంపూడి గంగరాజు మదనపడుతున్నాడు.
చదవండి: ‘నాన్న.. అమ్మను కొట్టకు బాగా చూసుకో.. నేనింక బ్రతకను..’

కఠినంగా శిక్షించాలి 
కొవ్వూరు సత్యవేణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పీడీఎస్‌యూ పూర్వపు జిల్లా అధ్యక్షుడు బి.సిద్ధు డిమాండ్‌ చేశారు. మానవత్వం మరచి అత్యాచారం చేసి మహిళలను హతమార్చిన నిందితులను దిశ చట్టం ప్రకారం ప్రభుత్వం 21 రోజుల్లో శిక్షించాలని అన్నారు. కొవ్వూరి సత్యవేణి కుటుంబసభ్యులను సిద్ధు పరామర్శించారు.

మరిన్ని వార్తలు