ఇద్దరి ప్రాణం తీసిన టీచర్ల బదిలీ.. ఒకరు గుండెపోటుతో, మరొకరు ఉరేసుకుని

10 Jan, 2022 05:02 IST|Sakshi
సరస్వతి (ఫైల్‌), శ్రీమతి(ఫైల్‌)

ఇద్దరు మహిళా టీచర్ల మృతి 

గుండెపోటుతో ఒకరు.. ఆత్మహత్య చేసుకుని మరొకరు  

మరిపెడ రూరల్‌/ మోర్తాడ్‌(బాల్కొండ): జీవో 317 నేపథ్యంలో బదిలీకిగురైన ఇద్దరు మహిళా టీచర్లు తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకరు గుండెపోటు వల్ల మరణిస్తే, మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆదివారం ఒకే రోజు జరిగిన ఈ సంఘటనలు ఉపాధ్యాయవర్గాల్లో ఆందోళన రేకెత్తించాయి. వివరాలిలా ఉన్నాయి.. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నల్లకుంట గ్రామానికి చెందిన పుల్యాల శ్రీమతి (మాధవి)(40) మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం పూసలతండా ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా ఉద్యోగం చేస్తున్నారు.

హన్మకొండలో నివాసముంటూ విధులకు హాజరవుతున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆమెను ములుగు జిల్లా ఏటురునాగారం మండలం రొయ్యూరు యూపీఎస్‌ పాఠశాలకు కేటాయించారు. అయితే బదిలీపై వెళ్లడం ఇష్టంలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఆమెకు ఆదివారం హన్మకొండలోని ఇంటి వద్ద గుండెనొప్పిరావడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు.  

వేరే జోన్‌కు బదిలీ చేశారని..  
నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం పల్లికొండకు చెందిన సరస్వతి (32)కి అదే మండలం బాబాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. భర్త గల్ఫ్‌కు వెళ్లగా, సరస్వతి బాబాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ)గా పని చేస్తున్నారు. ఉద్యోగుల బదిలీల్లో భాగంగా సరస్వతి రాజన్న సిరిసిల్ల జోన్‌ పరిధిలోకి బదిలీ అయ్యారు.

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండా పాఠశాలకు ఆమెను ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అయితే సొంత జిల్లా నుంచి పక్క జిల్లాకు బదిలీ కావడంతో సరస్వతి తీవ్ర మానసిక ఒత్తిడి గురైనట్లు తెలిసింది. పొరుగు జిల్లాలో పని చేయడం ఇష్టం లేక ఆమె.. ఆదివారం ఇంట్లో ఉరేసుకున్నారు. బదిలీ కారణంగా తనకు అన్యాయం జరిగిందనే మనో వేదనతో సరస్వతి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, సహచరులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు