ఇద్దరూ ప్రాణ స్నేహితులు.. ఒకేసారి ఆత్మహత్య 

22 Jul, 2021 21:25 IST|Sakshi
దేవరాల శ్రీను (ఫైల్‌) ,పాపిరెడ్డి (ఫైల్‌)

సాక్షి, అద్దంకి: ఇద్దరు స్నేహితులు వేర్వేరు సమస్యలతో ఒకేసారి.. ఒకే చోట మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మండలంలోని ధర్మవరంలో బుధవారం జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవరాల శ్రీను (38)కు బల్లికురవ మండలం కొణిదెన గ్రామానికి చెందిన అంకమ్మతో పదహారేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త తాగుడుకు బానిస కావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

అంకమ్మ ఆరేళ్ల క్రితం భర్తను వదిలేసి కుమార్తెతో పుట్టింట్లో ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన మేడగం పాపిరెడ్డి(55)కి భార్య ధనలక్ష్మి, ఇద్దరు పెళ్లయిన కుమారులు ఉన్నారు. పాపిరెడ్డికి 10 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తుంటాడు. కొన్నేళ్లుగా వ్యవసాయం కలిసి రాక నష్టాలు రావడం.. సంపాదన కోసం చేసిన ఇతర వ్యాపారాలు అచ్చిరాక అప్పులు పాలయ్యాడు. పొలం అమ్మి అప్పులు తీర్చేందుకు కుటుంబ సభ్యులు ససేమిరా అన్నట్లు స్థానికులు చెబుతున్నారు.  

ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్య 
పాపిరెడ్డి, శ్రీను స్నేహితులు కావడంతో బాధలను ఒకరికొకరు చెప్పుకుంటూ కలిసి తిరుగుతుండే వారు. ఈ క్రమంలో ఇద్దరూ బైకుపై తెల్లవారు జామున గ్రామంలో చక్కర్లు కొట్టారు. తెల్లవారిన తర్వాత ఊరి పొలిమేరల్లోని చెరువు గట్టు వద్ద ఒకరి పక్కన ఒకరు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీన్ని గ్రామస్తులు గమనించి 108కి ఫోన్‌ చేశారు. సిబ్బంది అక్కడి చేరుకునేలోపే వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మహేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల భార్యలు, అంకమ్మ, ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు  కేసులు నమోదు చేసినట్లుౖ ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు