మృత్యువులోనూ వీడని స్నేహబంధం

4 Aug, 2021 10:32 IST|Sakshi

వన్నెపూడి జంక్షన్‌ వద్ద ప్రమాదం

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌..

ఇద్దరు మిత్రుల మృతి

లోవ వెళ్లి వస్తుండగా ప్రమాదం

పిఠాపురం: వారిద్దరిదీ ఒకే ఊరు.. ఒకే వీధి.. ఒకే సామాజికవర్గం.. చిన్ననాటి నుంచీ ఇద్దరూ కలిసిమెలిసి పెరిగారు. ఇద్దరిలో ఎవరి పనైనా కలిసే వెళతారు. మృత్యువులోనూ వారిది వీడని స్నేహబంధమైంది. కత్తిపూడి బైపాస్‌ రోడ్డులో వన్నెపూడి జంక్షన్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గొల్లప్రోలు పోలీసుల కథనం ప్రకారం.. ఏలేశ్వరం గ్రామానికి చెందిన గండ్రెడ్డి మాధవరావు (48) రైతు. అదే గ్రామానికి చెందిన సిరగం వెంకటరమణ అలియాస్‌ శ్రీను (42) వ్యవసాయ కూలీ. వీరిద్దరూ చిన్ననాటి నుంచీ ప్రాణ స్నేహితులు. మంగళవారం ఉదయం తుని మండలం తలుపులమ్మ లోవకు మోటారు సైకిల్‌పై వెళ్లి, తిరిగి వస్తున్నారు.

కత్తిపూడి బైపాస్‌ రోడ్డులో వన్నెపూడి జంక్షన్‌ వద్ద బైక్‌ ప్రమాదవశాత్తూ డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరావు పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మాధవరావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట రమణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మృతితో ఏలేశ్వరంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు