గ్యాస్‌ లీక్‌ అవుతోంది..ఇక్కడి నుండి పారిపోండి

27 Jul, 2022 10:19 IST|Sakshi

హైదరాబాద్ (జీడిమెట్ల) : అనుమానాస్పదస్థితిలో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ పవన్, స్థానికుల కథనం ప్రకారం..సుభాష్ నగర్ డివిజన్‌ రాంరెడ్డి నగర్‌లోని ఓ ఇంట్లో ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన 8 మంది యువకులు అద్దెకు ఉంటూ.. అన్సారీ అనే కాంట్రాక్టర్‌ వద్ద పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి యువకులు వారు ఉండే గదిలోనే గొడవపడ్డారు. అరుపులు, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. 

రాత్రి 8 గంటలకు ఓ యువకుడు ఆ గది నుంచి అకస్మాత్తుగా బయటకు వచ్చి ‘గ్యాస్‌ లీక్‌ అవుతోంది..ఇక్కడి నుండి పారిపోండి’ అని అరుస్తూ అక్కడి నుంచి పారిపోయాడు. అతడు వెళ్లిన రెండు నిమిషాల్లోనే భారీ పేలుడు సంభవించింది. భవనం గోడ ఓ పక్కకు కూలిపోయింది. మంటలు చెలరేగాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న జీడిమెట్ల ఫైర్‌ సిబ్బంది ఘటనాస్ధలికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. అనంతరం పరిశీలించగా ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన నబీదుద్దీన్‌ (20), బీరేందర్‌ (35)ల మృతదేహాలు లభించాయి. పేలుడు ధాటికి వీరు మృతిచెందారు. ఘటనా స్థలిలో 4 గ్యాస్‌ సిలిండర్లు చిందరవందరగా పడి ఉన్నాయి.  

పథకం ప్రకారమే హత్య చేసి గ్యాస్‌ పేల్చారా? 
ఉదయం నుంచి జరిగిన గొడవల్లో భాగంగా..నబీదుద్దీన్, బీరేందర్‌లను చంపి అనుమానం రాకుండా గ్యాస్‌ సిలిండర్లను పేల్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. గదిలో ఉండే యువకులు ఎవరూ లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్‌మార్టం అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బాలానగర్‌ ఏసీపీ గంగారాం పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు