మేమేం పాపం చేశాం.. మాకెందుకీ కడుపుకోత

20 Apr, 2021 11:51 IST|Sakshi

నల్గొండ: ‘అయ్యో దేవుడా మేమేం పాపం చేశాం.. మాకెందుకీ కడుపుకోత.. మా బిడ్డలతో పాటే మమ్మల్నీ తీసుకుపో’ అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. ఏఎమ్మార్పీ కాల్వలో గల్లంతైన మరో బాలుడు నందు కూడా మృతిచెందాడు. అతడి మృతదేహం సోమవారం పానగల్‌– కట్టంగూర్‌ రోడ్డు సమీపంలో కాల్వలో లభ్యమైంది.

జిల్లా కేంద్రంలోని సుందరయ్య కాలనీకి చెందిన గార్లపాటి రాంబాబు, మమతల పెద్ద కుమారుడు  చందు(10), చిన్న కుమారుడు నందు(6) ఇంటి సమీపంలోని మెయిన్‌ కెనాల్‌లో ఆదివారం ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. చందు మృతదేహం అదే రోజు లభించగా నందు ఆచూకీ కోసం కాల్వలో నీటి ప్రవాహం తగ్గించి గాలించారు. పానగల్‌ సమీపంలోని చెట్లపొదల్లో నందు మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తలరించినట్లు ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇద్దరు కుమారులు ఒకేసారి మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చిన్నారుల మృతిలో ఏమైనా కుట్ర కోణం ఉందా..? ప్రమాదవశాత్తు మరణించారా..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల తండ్రి రాంబాబు ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

( చదవండి: ఓటు వేశాక అనుకోని ప్రమాదం: ఇద్దరు ఉద్యోగులు మృతి ) 

మరిన్ని వార్తలు