బైక్‌ను ఢీకొట్టి.. 10 మీటర్లు ఈడ్చుకెళ్లి..

28 Jan, 2023 02:33 IST|Sakshi
బైక్‌ను ఢీకొన్న కారు   

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం 

మల్యాల(చొప్పదండి): కారు బైక్‌ను ఢీకొ ని సుమారు పది మీటర్ల దూరం లాక్కె ళ్లిన ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయ పడిన ఇద్దరు దుర్మరణం చెందారు. ఓ యువకుడిని ఈడ్చుకెళ్లడంతో రోడ్డంతా మాంసపు ముద్ద, రక్తపు మరకలతో గగుర్పొడిచేలా తయారైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్‌ జిల్లా మానకొండురు మండల కేంద్రానికి చెందిన మహమ్మద్‌ అబ్దుల్‌ లతీఫ్‌(32) అతడి స్నేహితుడు మహమ్మద్‌ హమీద్‌ ఖాన్‌(28)తో కలిసి ఈనెల 26న జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి బైక్‌పై వెళ్లారు.

గురువారం అర్థరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. మల్యాల మండలం ముత్యంపేట శివారులోకి రాగానే.. జగిత్యాల–కరీంనగర్‌ జాతీయ రహదారిపై దిగువ కొండగట్టు వద్ద వారి బైక్‌ను ఎదురుగా వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. కారు చక్రాల్లో బైక్‌ చిక్కుకోవడంతో  పది మీటర్ల దూరం లాక్కెళ్లింది. బైక్‌ నడుపుతున్న హమీద్‌ఖాన్‌ కుడికాలు రక్తపు ముద్దలతో  రోడ్డంతా తడిసింది.

అబ్దుల్‌ లతీఫ్‌ ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డాడు. 108 అంబులెన్స్‌లో ఇద్దరినీ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో హమీద్‌ఖాన్‌ మృతిచెందారు. అబ్దుల్‌ లతీఫ్‌ ఖాన్‌ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. లతీఫ్‌ సోదరుడు అబ్దుల్‌ రఫీక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారును నడిపిన వ్యక్తి జగిత్యాలకు చెందిన ఎర్ర సాయివర్ధన్‌గా గుర్తించారు.

మరిన్ని వార్తలు