ఇద్దరు చిన్నారులను మింగిన పిల్లర్‌ గుంత

8 Sep, 2023 03:41 IST|Sakshi

ఇటీవలి వర్షాలకు భవనం పిల్లర్ల కోసం తీసిన గోతిలో చేరిన నీరు

ఆడుకుంటూ వెళ్లి అందులోజారిపడ్డ పిల్లలు

బాల్కొండ: నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్‌పేట్‌ గ్రామంలో గురువారం భవన నిర్మాణం కోసం తవ్విన పిల్లర్‌ గుంతలో పడి వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన మెట్టు నాస్తిక్‌ (4), నిషాంత్‌ చరణ్‌ (4) ఆడుకో వడానికి ఉదయం ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇటీవల గ్రామంలో వీడీసీ భవన నిర్మాణం కోసం  పనులు ప్రారంభించారు.

ఈ క్రమంలో పిల్లర్ల కోసం గుంతలను తవ్వారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో గుంతల్లో నీరు నిలిచింది. ఆడుకుంటూ అటువైపు వెళ్లిన చిన్నారులు గుంత పక్కనున్న మట్టి కుప్పపైకి చేరుకున్నారు. అక్కడి నుంచి జారి గుంతలో పడిపోయారు. మధ్యాహ్నం దాటినా పిల్లలు ఇంటికి రాకపోవడం, ఎక్కడా కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు సమీపంలో ఉన్న చెరువు వైపు, గ్రామంలోనూ వెతికారు.

మధ్యాహ్నం దాటా క భవన నిర్మాణం పక్కనుంచి వెళ్తున్న ఓ వ్యక్తికి గుంతలో ఓ చిన్నారి వీపు భాగం కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్తులు కర్ర సాయంతో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఎస్సై గోపి సిబ్బందితో కలసి ఘటనాస్థలిని పరిశీలించారు. కాంట్రాక్టర్‌ పిల్లర్లు తవ్వి రక్షణ చర్యలు చేపట్టకుండా వదిలేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని, అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

వలస వచ్చి రెండు నెలలు..
మృతుల్లో నిషాంత్‌ చరణ్‌ తల్లిదండ్రులు గ్రామానికి బతుకుదెరువు కోసం చిట్టాపూర్‌ నుంచి వలస వచ్చారు. చరణ్‌ తండ్రి శ్రీకాంత్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బతుకు దెరువు కోసం వస్తే బతుకునే కాటేసిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు చిన్నారి నాస్తిక్‌ తండ్రి దేవాదాస్‌ 2 నెలల క్రితం ఉపాధి కోసం మాల్దీ వులకు వెళ్లాడు. వారికి కూమార్తె, కుమారుడు ఉండగా అందులో నాస్తిక్‌ మృతిచెందాడు. కాగా, మృతుల కుటుంబాలకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

మరిన్ని వార్తలు