ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

22 Aug, 2021 03:06 IST|Sakshi
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ సునీల్‌దత్‌  

కొత్తగూడెం టౌన్‌: నిషేధిత మావోయిస్టు పార్టీ ఇద్దరు సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొత్తగూడెంలో ఎస్పీ సునీల్‌దత్‌ శనివారం వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్దమిడిసెలేరుకు చెందిన గట్టుపల్లి సురేశ్, బొడిక భీమయ్య గతంలో మూడేళ్లు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని దళాల్లో పనిచేశారు. ఆ తర్వాత చర్ల ఎల్‌ఓసీ సభ్యులుగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. అయితే, మావోయిస్టు తెలంగాణ స్టేట్‌ కమిటీలోని కొందరు వేధిస్తుండటంతో భరించలేక పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.

అంతేకాకుండా గిరిజన మహిళలు, చిన్నారులతో మావోయిస్టులు బలవంతంగా పని చేయించుకుంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సురేశ్, భీమయ్య తెలిపారు. కాగా, మావోయిస్టులు లొంగిపోతే వారి భవిష్యత్‌కు అన్నివిధాల అండగా నిలుస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అనంతరం వారిద్దరికీ రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్‌ హరిఓం ఖారే, సెకండ్‌ ఇన్‌ కమాండెంట్‌ ప్రమోద్‌ పవార్, భద్రాచలం ఏఎస్పీ వినీత్, చర్ల సీఐ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

మావోయిస్టు అరెస్ట్‌ 
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఓ మావోయిస్టును శనివారం అరెస్ట్‌ చేసినట్టు ఎస్పీ సునీల్‌శర్మ తెలిపారు. అరెస్టు చేసిన మావోయిస్టు శివయాదవ్‌పై రూ.లక్ష రివార్డు ఉందని వెల్లడించారు. 2012లో కలెక్టర్‌ను కిడ్నాప్‌ చేసిన కేసులో శివయాదవ్‌ నిందితుడని ఎస్పీ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు