మాట్లాడాలని పిలిచి కత్తితో దాడి

24 Dec, 2020 11:38 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్‌ఐ

సాక్షి చీమకుర్తి: లెక్కలేని తనం, చులకన భావం, అహంకారం వెరసి నిండు ప్రాణం గాలిలో కలిసింది. మేనల్లుడిని ఒక దెబ్బ కొట్టినందుకు ఇద్దరు బావలు కలిసి బావమరిదిని తలపై ఇనుప పైపుతో బలంగా కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృత్యువాతపడ్డాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సంతనూతలపాడు మండలం గుమ్మనంపాడుకు చెందిన తాడి చిరంజీవి (30) తలపై తన బావలు వెలుగు శ్రీనివాస్, కోటిలు ఇనుప పైపు తీసుకొని బలంగా బాదారు. మంగళవారం సాయంత్రం ఈ సంఘటన జరగగా రాత్రి ఒంటి గంట సమయంలో ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ దాసరి రాజారావు తెలిపారు. మృతదేహాన్ని సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ రాజారావు పరిశీలించారు. మృతుడి భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చదవండి: ప్రియుడి మోసం.. నర్సు ఆత్మహత్య
చదవండి:
 ‘నన్ను చూసి నవ్వుతావంట్రా.. ఎంత ధైర్యంరా నీకు’


 గాయపడిన సాయి మణికంఠ  

సాక్షి, అద్దంకి : ఉన్న సమస్యను కూర్చొని మాట్లాడుకుందాం..అంటూ పిలిపించి యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఆ యువకుడు  పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ  సంఘటన పట్టణంలోని బస్టాండ్‌ సెంటర్‌ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జె.పంగులూరుకు చెందిన గుంజి సాయి మణికంఠ హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పాలెపు శ్రీను కుమార్తె తనను ప్రేమించమంటూ సాయి మణికంఠ వెంట పడేది. ఆమె పదే పదే అలాగే చేస్తుండటంతో అతడు ఆమె తండ్రితో విషయం చెప్పి కుమార్తెను జాగ్రత్త చేసుకోమని కోరాడు. శ్రీను కుమార్తె అదే పనిగా మళ్లీ మణికంఠకు ఫోన్లు చేస్తోంది.

కుమార్తెకు నచ్చజెప్పినా వినక పోవడంతో ఆమె తండ్రి హైదరాబాద్‌లో ఉన్న సాయి మణికంఠను ఊరికి రమ్మని కోరాడు. వస్తే తమ కుమార్తె విషయం మాట్లాడాలని చెప్పి పిలిపించాడు. యువకుడు అద్దంకి బస్టాండ్‌ వద్దకు రాగానే శ్రీను పథకం ప్రకారం కత్తితో దాడి చేశాడు. హఠాత్‌ పరిణామానికి భీతిల్లిన మణికంఠ బతుకు జీవుడా అంటూ పారిపోయి ఓ చోట దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నాడు. తేరుకున్న తర్వాత 108కి ఫోన్‌ చేశాడు. 108 సిబ్బంది వచ్చి క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేశ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు