ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం

21 Jun, 2021 04:32 IST|Sakshi
ఘటన జరిగింది ఈ ప్రాంతంలోనే

కృష్ణానది ఒడ్డున ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై దాడి చేసి ఘాతుకం 

అనంతరం పడవలో పారిపోయిన దుండగులు

సాక్షి, గుంటూరు/తాడేపల్లి రూరల్‌: గుంటూరు జిల్లా సీతానగరం పుష్కర్‌ ఘాట్‌ సమీపంలో శనివారం రాత్రి ఓ యువతి అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియుడితో కలిసి కృష్ణా నది ఒడ్డున సేదతీరేందుకు వెళ్లిన ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి జరిపారు. యువకుడిని బంధించి, యువతిపై అత్యాచారానికి తెగబడ్డారు.

విజయవాడ గాంధీనగర్‌లోని పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న ఓ యువకుడు, నర్సుగా పనిచేస్తున్న యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహం వాయిదా పడింది. శనివారం రాత్రి 9 గంటలకు ఆ జంట కృష్ణా నది ఒడ్డున సీతానగరం రైల్వే బ్రిడ్జి దిగువన గల పుష్కర్‌ ఘాట్‌కు వచ్చి మాట్లాడుకుంటుండగా.. ఇద్దరు దుండగులు దాడికి పాల్పడి యువకుడిని బంధించి.. యువతిని పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం వారివద్ద ఉన్న సెల్‌ఫోన్లను తీసుకుని పడవలో నది మీదుగా పరారయ్యారు.

అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రేమజంట ప్రకాశం బ్యారేజి వద్దకు చేరుకుని అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు విషయం చెప్పారు. అడిషనల్‌ ఎస్పీ ఈశ్వరరావు, మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్, తాడేపల్లి సీఐ శేషగిరిరావు రంగంలోకి దిగి.. బాధితురాలిని చికిత్సకు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. సెల్‌ టవర్‌ లొకేషన్స్, సీసీటీవీ ఫుటేజ్‌లు, బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోందని అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు