లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌

27 Mar, 2023 02:10 IST|Sakshi

వారు కూడా ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలుచేసినట్లు తేల్చిన సిట్‌ 

నిందితులు ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్‌గా నిర్ధారణ 

పోలీసుల అదుపులో మరో నలుగురు అనుమానితులు 

అదనపు కస్టడీలోకి ప్రవీణ్, డాక్యా సహా నలుగురు 

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో సిట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నీలేష్ , గోపాల్, డాక్యా, రాజేందర్‌లు ఈ నెల 4న రాత్రి హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో బస చేసినప్పుడు వారిని మరో ఇద్దరు అభ్యర్థులు కలిసి ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు పక్కా ఆధారాలతో గుర్తించారు. వారిని నవాబ్‌పేట్, షాద్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమా­ర్‌గా నిర్ధారించారు.

డాక్యా, రేణుకల విచారణలోనూ ఇదే విషయం రుజువు కావడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌­కు తరలించారు. ఆ అభ్యర్థులిద్దరూ ప్రశ్నపత్రాన్ని రూ.18 లక్షలకు కొనేందుకు డాక్యా, ఇతరులతో ఒప్పందం కుదుర్చుకొని రూ.10 లక్షల వరకు చెల్లిం­చారని సిట్‌ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహా­రంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మహబూబ్‌నగర్‌లోని సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్యతోపాటు మరో ముగ్గురు అనుమానితులను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తిరుపతయ్య... ప్రశాంత్, రాజేంద్రకుమా­ర్‌­లతోపాటు పలువురు ఎన్‌ఆర్‌­ఈజీఎస్‌ ఉద్యోగులకు ఏఈ ప్రశ్నపత్రం విక్రయంలో దళారిగా వ్యవ­హరించాడని సిట్‌ ప్రాథమికంగా నిర్ధారించింది. పూర్తి ఆధారాలు లభించాక అతనితోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేయాలని భావిస్తోంది. మరోవైపు గతేడాది నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థుల విచారణ కొనసాగుతోంది. ఆదివారం మరో 20 మంది అభ్యర్థులను అధికారులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు విచారించిన వారి సంఖ్య 50 దాటింది. 

అడ్డదారి తొక్కి.. అడ్డంగా బుక్కయ్యి.. 
షాద్‌నగర్‌ రూరల్‌: సిట్‌ అధికారులు తాజాగా అరెస్టు చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకడైన రాజేంద్రకుమార్‌ది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పరిధిలోని నేరేళ్ల చెరువు గ్రామం. నిరుపేదలైన లక్ష్మ­య్య, లక్ష్మీదేవమ్మ దంపతుల నలుగురు సంతానంలో అతను పెద్ద కొడుకు. రాజేంద్రకుమార్‌ కొన్నేళ్లు ఉపాధి హామీ పథకంలో పనిచేసి కుటుంబాన్ని పోషించాడు.

ప్రభుత్వ ఉద్యో­గం సంపాదించడం కోసం అప్పులు చేసి హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. అయితే కచ్చి తంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. తన కుటుంబ సభ్యుల వద్ద ఉన్న బంగారాన్ని అమ్మడంతోపాటు ఇతరుల వద్ద అప్పు చేసి రూ.5 లక్షలకు డాక్యా నాయక్‌ ద్వారా ఏఈఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ బండారాన్ని సిట్‌ నిగ్గుతేల్చడంతో అడ్డంగా బుక్కయ్యాడు. 

8 గంటలపాటు నిందితుల విచారణ 
టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో కోర్టు అదనపు కస్టడీకి అనుమతించడంతో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌లను పోలీసులు ఆదివారం చంచల్‌గూడ జైలు నుంచి సిట్‌ కార్యాలయానికి తరలించారు. దాదాపు ఎనిమిది గంటలపాటు వారిని ప్రశ్నించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో సిట్‌ కార్యాలయం నుంచి సీసీఎస్‌కు తరలించారు. సోమ, మంగళవారాల్లోనూ వారిని విచారించనున్నారు. 

మరిన్ని వార్తలు