‘అప్పన్న బంగారం’కేసు: తెరపైకి కొత్త ముఖాలు 

10 Sep, 2020 07:48 IST|Sakshi
గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు వెల్లడిస్తున్న క్రైమ్‌ ఏడీసీపీ సురేబాబు(ఇన్‌సెట్‌లో) ఏ1– హైమావతి, ఏ2–రాంభక్త వాసు, ఏ3–నాగేంద్రతేజ

తక్కువ ధరకు బంగారం పేరిట

నెల్లూరు వాసికి బురిడీ 

హైమావతితో పాటు ఆమె కుమారుడు, సహకరించిన వ్యక్తి అరెస్ట్‌ 

గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు 

వెల్లడించిన డీసీపీ సురేష్‌బాబు 

గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): సింహాద్రి అప్పన్న బంగారం విక్రయం పేరిట టోకరా చేసిన కేసులో కొత్త ముఖాలు వెలుగుచూశాయి. నెల్లూరు వాసి శ్రావణిని మోసం చేసిన ఈ వ్యవహారంలో ఇంత వరకు కోన హైమావతి, ఆమె తమ్ముళ్లే నిందితులని అంతా భావించారు. అయితే ఈ కేసులో కొత్తగా మరో ఇద్దరు తెరపైకి వచ్చారు. వీరిలో హైమావతి కుమారుడు నాగేంద్ర తేజ కాగా.. మరో వ్యక్తి నకిలీ బిల్లులు తయారు చేసిన రాంభుక్త వాసు. ముగ్గరు నిందితులను గోపాలపట్నం పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌లో డీసీపీ సురేష్‌బాబు ఈ కేసు వివరాలు వెల్లడించారు. (చదవండి: విశాఖలో విషాదం, కుటుంబం ఆత్మహత్య)

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మద్దూరి శ్రావణి.. రూ1.44 కోట్లకు వేలంలో బంగారాన్ని కొనుగోలు చేశానని, కానీ ఇంతవరకు పంపలేదంటూ సింహాచలం దేవస్థానానికి ఈ–మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా రూ.1.30 కోట్లు, రూ.14 లక్షలతో ఉన్న బిల్లులను కూడా జత చేసి పంపింది. దీంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. దేవస్థానం అధికారులు ఈ బిల్లులు నకిలీవని, అప్పటి ఈవో భ్రమరాంబ సంతకాన్ని ఫోర్జరీ చేశారని గుర్తించి గోపాలపట్నం పోలీస్‌ సేŠట్‌షన్‌లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో శ్రావణి కూడా తనకు జరిగిన మోసంపై సూళ్లూరుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గోపాలపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు మోసం చేసే విధానాన్ని బయటపెట్టారు. ఈ వ్యవహారంలో రూ.38,20,800 చేతులు మారినట్టు పోలీసులు గుర్తించారు. (చదవండి: అప్పన్న బంగారం పేరిట రూ.1.44 కోట్లకు టోకరా)

ఇదీ అసలు కథ 
ఈ కేసులో ప్రధాన నిందితురాలు కోన హైమావతి అలియాస్‌ డెక్క హైమావతి సింహాచలంలో అల్లిక దారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడూ సింహాచలం క్షేత్రానికి వచ్చే సమయంలో శ్రావణికి హైమావతి పరిచయమైంది. దీంతో ఇటీవల దేవస్థానంలో బంగారం వేలం వేస్తారని, అయితే కరోనా నేపథ్యంలో ఓపెన్‌ ఆంక్షన్‌ వేయడం లేదని, తనకు తెలిసిన బంధువులు ఇక్కడ ఉద్యోగులుగా ఉన్నారని, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని హైమావతి నమ్మబలికింది. దాని విలువ రూ.1.44 కోట్లు ఉంటుందని చెప్పింది. ఈ మేరకు బిల్లులు కావాలని శ్రావణి కోరగా.. రామభుక్త వాసు సహకారంతో దొంగ బిల్లులు సృష్టించి.. అప్పటి ఈవో భ్రమరాంబ సంతాకాన్ని ఫోర్జరీ చేసి వాట్సప్‌లో పంపారు. అది నమ్మిన శ్రావణి.. హైమావతి కుమారుడు డెక్క నాగేంద్ర తేజ అకౌంట్‌కు రూ.7.6 లక్షలు, హైమావతి బ్యాంకు ఖాతాకు రూ.30,60,800 బదిలీ చేసింది. ఈ నగదుతో హైమావతి తనకున్న రూ.15లక్షల అప్పులు తీర్చింది. ఓ డ్యూక్‌ బైక్‌ కొన్నారు. దుకాణం ఏర్పాటు కోసం అడ్వాన్స్‌ కింద సుమారు రూ.2 లక్షలు నగదు చెల్లించినట్టు గుర్తించామని డీసీపీ తెలిపారు. అంతే కాకుండా బంగారం, వెండి ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు కొనుగోలు చేశారన్నారు. ఈ మొత్తాన్ని సూళ్లూరుపేట పోలీసులు రికవరీ చేస్తారని ఆయన పేర్కొన్నారు.

రామభుక్త వాసు నకిలీ నగదు బిల్లులు తయారు చేసి, వాట్సప్‌ ద్వారా పంపించడం వంటి పనులు చేశాడు. ఫోర్జరీ చేసిన ఈవో సంతకాన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తున్నామని డీసీపీ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపించామని, తరువాత జ్యూడీషియల్‌ కస్టడీకి తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంలో దేవస్థానంలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న హైమావతి తమ్ముళ్లు గోపా మధు, గోపా శేఖర్‌ల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రావన్‌కుమార్, సీఐ మళ్ల అప్పారావు, క్రైమ్‌ సీఐ వెంకునాయుడు, ఎస్‌ఐలు రఘురామ్, సునీత, కంచరపాలెం క్రైమ్‌ ఎస్‌ఐ సూరిబాబు, ఎంవీపీ క్రైమ్‌ ఎస్‌ఐ విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా