ఒక్క తప్పు.. రెండు ప్రాణాలు బలి

13 Jul, 2021 04:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మరొకరు ఆస్పత్రిపాలు 

మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం.. 

గుంటూరు జిల్లా యడ్లపాడులో ఘటన 

యడ్లపాడు: ఆమె చేసిన పొరపాటు ఆమెతో పాటు మరొకరి ప్రాణాలను బలితీసుకుంది. భర్తను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. యడ్లపాడు మండలం చెంఘీజ్‌ఖాన్‌పేటలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మామిడాల మహేశ్వరి(21)కి ఆర్మీలో పనిచేసే అదే గ్రామానికి చెందిన మేనమామ శివశంకర్‌తో 11 నెలల కిందట వివాహమైంది. ఇటీవల అతడికి హైదరాబాద్‌ బదిలీ అవడంతో భార్యను తీసుకెళ్లేందుకు సెలవుపై గ్రామానికొచ్చాడు. అయితే భర్తతో వెళ్లడం ఇష్టం లేక.. ఈ నెల 8న ఇంట్లో చెప్పకుండా ప్రకాశం జిల్లా ఆదిపూడిలో ఉండే ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. మహేశ్వరి కుటుంబ సభ్యులు వెళ్లి ఇంటికి రావాలని కోరినా ఆమె రాలేదు. దీంతో మనస్తాపం చెందిన మహేశ్వరి భర్త శివశంకర్‌ అదే రోజు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

గమనించిన బంధువులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. జరిగిన విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా ఆదిపూడికి చెందిన ప్రియుడి తండ్రి చుండూరి భద్రయ్య(50).. తమ కుటుంబం పరువు పోయిందన్న అవమానంతో ఆ మరుసటి రోజే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం మహేశ్వరికి నచ్చజెప్పి కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనల నేపథ్యంలో కలత చెందిన మహేశ్వరి ఆదివారం బాత్‌రూంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కొద్దికాలం కిందటే శివశంకర్‌ తండ్రి శివయ్యకు గుండె ఆపరేషన్‌ చేశారు. తనకు నలుగురు కుమార్తెల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కుమారుడి జీవితం ఇలా అయిందేంటని శివయ్య, తల్లి అక్కమ్మ కుమిలిపోతున్నాడు. ఓ వైపు కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం, మరోవైపు శివశంకర్‌ ఆస్పత్రిలో ఉండటంతో మహేశ్వరి తల్లిదండ్రులు వెంకటనాగలక్ష్మి, సాంబశివరావులు తల్లడిల్లిపోతున్నారు. వెంకటనాగలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పైడి రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు