మావోయిస్టుల మందుపాతరకు ఇద్దరు మృతి

4 Aug, 2020 08:48 IST|Sakshi
రెండేళ్ల కిందట పోలీసులు స్వాధీనం చేసుకున్న మందుపాతర 

పెదబయలు(అరకులోయ): తప్పిపోయిన పశువుల కోసం వెళ్లి ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.  పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు మండలంలో చింతలవీధికి చెందిన  ఇద్దరు  గిరిజనులు బలవడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. 60 కుటుంబాలు నివసిస్తున్న ఆ గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మృతులిద్దరూ వరుసకు అన్నదమ్ములు. వారంరోజులకిందట తప్పినపోయిన రెండు పశువులను వెతికేందుకు జామిగుడ పంచాయతీ చింతలవీధి గ్రామానికి చెందిన మొండిపల్లి మోహన్‌రావు(30),మొండిపల్లి అజయ్‌కుమార్‌(20) ఆదివారంఉదయం బయలుదేరారు. మూడు కిలోమీటర్ల దూరంలో గల  ఇంజరి పంచాయతీ కోండ్రు అటవీ ప్రాంతానికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్లారు. అక్కడ మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు పెట్టడంతో అది ఒక్కసారిగా పేలి వారిని బలితీసుకుంది.   మోహన్‌రావుకు నడుము నుంచి కింద భాగం శరీరం పూర్తిగా తునాతునకలైంది.  అజయ్‌కుమార్‌కు  కుడి చెయ్యి పూర్తిగా తెలిపోగ, ఎడమ చేయి, తలపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ శబ్దం విన్న స్థానికులు.. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నట్టు భావించి అటవీ ప్రాంతానికి వెళ్లేందుకు భయపడ్డారు.

పశువులు వెతకడానికి వెళ్లిన అన్నదమ్ములు తిరిగిరాకపోవడంతో ధైర్యం చేసి గ్రామస్తులు అక్కడికి వెళ్లారు. అటవీ ప్రాంతంలో వీరి మృతదేహాలు పడి ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. మోహన్‌రావుకు భార్య కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయ్‌కుమార్‌కు పెళ్లి కాలేదు.తల్లిదండ్రులు  ఉన్నారు. మృతదేహాలను అటవీ ప్రాంతం నుంచి చింతలవీధి గ్రామానికి కుటుంబ సభ్యులు తరలించారు.  ఈ ప్రాంతంలో మందుపాతరకు గిరిజనులు బలికావడం ఇదే ప్రథమం.   గతంలో కూడా ఈప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరలు పెట్టారు. మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాలు ప్రశాతంగా ముగుస్తున్న తరుణంలో ఈ సంఘటన జరగడంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. మందుపాతర పేలి మృత్యువాత పడిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

ఇంజరి పంచాయతీలోని కోండ్రు అటవీ ప్రాంతం  

గిరిజనులకు ప్రాణ సంకటం
పాడేరు: అడవుల్లో సంచరించే పోలీసు పార్టీలను మట్టుబెట్టాలనే వ్యూహంతో మావోయిస్టులు భారీగా ఏర్పాటు చేస్తున్న మందు పాతరలను గిరిజనులకు ప్రాణ సంకటంగా మారాయి. రెండేళ్ల కిందట పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలోని కోండ్రుం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందు పాతరలను పోలీసు బలగాలు ముందుగానే గుర్తించి నిర్వీర్యం చేయడంతోపాటు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసు పార్టీలు త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాయి. అయితే ఇలాంటి మందు పాతరలు ఏవోబీ వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు భారీగా ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. ఈ మందుపాతరల ఉనికిని పోలీసులు పసిగడుతున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు మాత్రం గుర్తించక ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. గిరిజనులకు అటవీ ప్రాంతాల్లో సంచరించి పశువుల కాపల, అటవీ ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో మందు పాతరలను గిరిజనులు గుర్తించలేకపోతున్నారు. 

ఫలించిన పోలీసుల వ్యూహం 
పాడేరు/ముంగింపుట్టు: మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసు యంత్రాంగం ముందస్తుగానే వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టింది. గత నెల 28  నుంచి ఈ నెల 3   వరకు  వారోత్సవాల నిర్వహణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. అయితే అంతకు ముందే ఒడిశా పోలీసు బలగాలతో పాటు విశాఖ ఏజెన్సీ పోలీసు పారీ్టలు కూడా ఏవోబీ వ్యాప్తంగా కూంబింగ్‌ చర్యలను విస్తృతం చేయడంతో వారిని కట్టడి చేయగలిగారు. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు, సంస్మరణల వా రోత్సవాల చివరి రోజున మందుపాతర పేలి ఇద్దురు గిరిజనులు మృతి చెందారు. ఒడిశాలోని ముకుడుపల్లి, ఏజెన్సీలోని పెదబయలు మండలం లండులు అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకోగా గాయాలతో మావోయిస్టులు త్రుటిలో తప్పించుకున్నారు.

జి.మాడుగుల మండలం కిల్లంకోట, మల్కన్‌గిరి జిల్లా పరిధిలోని గుజ్జెడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. మిగిలిన మావోయిస్టులు ఈ ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నారు. తర్వాత వారోత్సవాలను మావోయిస్టులు ప్రారంభించినప్పటికీ ఈ ఏడాది పెద్దగా ప్రభావం చూపలేదు. ఒడిశాలోని కటాఫ్‌ ఏరియాలో గతనెల 28న కొద్దిపాటి గిరిజనులతో అమరవీరుల వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహించారు.  ఆ తర్వాత ఎక్క డా భారీ స్థాయిలో వారోత్సవాలను నిర్వహించిన దాఖలా లు లేవు.  మావోయిస్టులంతా ఏవోబీలో సురక్షిత ప్రాంతా లకే పరిమితమయ్యారనే ప్రచారం జరిగింది. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు ఏవోబీ వ్యాప్తంగా భారీగా పోలీసు బలగాలు అటవీ ప్రాంతాల్లో మోహరించి జల్లెడ పట్టాయి. మరోవైపు వర్షాలు కూడా విస్తారంగా కురవడంతో మా వోయిస్టుల వారోత్సవాలకు ఆటంకం కలిగినట్టు తెలుస్తుంది. భారీ వ్యూహాంతో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం అమరవీరుల వారోత్సవాలను కట్టడి చేసి మావోయిస్టులపై పైచేయి సాధించింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా