ప్రమాదం ఒకరిది.. ప్రాణాలు ఇతరులవి..

20 Dec, 2020 03:50 IST|Sakshi
ప్రమాదంలో కాలిపోతున్న కంటైనర్‌

నూజివీడు: రెక్కాడితేగానీ డొక్కాడని ఇద్దరు నిరుపేద వ్యక్తులను కంటైనర్‌ లారీ రూపంలో పొంచి ఉన్న మృత్యువు కబళించివేసింది. కుటుంబాన్ని పోషించే వారు విగతజీవులవ్వడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ ఘటన నూజివీడు మండలం పోలసానపల్లి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గొల్లపల్లి నుంచి ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు  వైపు వెళ్తున్న కంటైనర్‌కు పోలసానపల్లి సమీపంలోకి వచ్చే సరికి 11కేవీ విద్యుత్‌ తీగలు తగిలాయి. గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్‌ వెంటనే కిందకు దూకి..ప్రాణాలు దక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అదే సమయంలో నూజివీడు మండలంలోని మీర్జాపురంలో చిన్న ఫ్యాన్సీ షాపు నడుపుకునే పశ్చిమగోదావరి జిల్లా అప్పనవీడుకు చెందిన పెనుమాక జోజిబాబు(36), మీర్జాపురం గ్రామానికి చెందిన షేక్‌ మస్తాన్‌(65) ద్విచక్రవాహనంపై కోడిగుడ్ల కోసం వట్టిగుడిపాడు వైపు వెళ్తున్నారు. పోలసానపల్లి వద్దకు వచ్చే సరికి రోడ్డుపై అడ్డంగా కంటైనర్‌ ఉండడంతో.. ఇదేమిటని వారు కొద్దిగా ముందుకెళ్లి ఆ కంటైనర్‌ను ముట్టుకోగా.. తీవ్ర విద్యుత్‌షాక్‌కు గురయ్యారు.

అంతలోనే ద్విచక్రవాహనం పెట్రోలు ట్యాంక్‌ వద్ద నుంచి మంటలు చెలరేగి వారిద్దరూ ఘటనాస్థలంలోనే సజీవ దహనమయ్యారు. జోజిబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. తహసీల్దార్‌ మెండు సురేష్‌కుమార్‌  ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం తీరును తెలుసుకున్నారు. రూరల్‌ ఎస్‌ఐ రంజిత్‌  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు పరామర్శించారు.  

మరిన్ని వార్తలు