ఓటు వేశాక అనుకోని ప్రమాదం: ఇద్దరు ఉద్యోగులు మృతి

18 Apr, 2021 08:59 IST|Sakshi

సాక్షి, నాగార్జునసాగర్‌: మితివీురిన వేగం.. ఆపై మూలమలుపు ముగ్గురిని బలితీసుకున్నాయి. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ దుర్ఘటన నాగార్జునసాగర్‌ పైలాన్‌కాలనీలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్‌లోని హిల్‌కాలనీకి చెందిన మల్లయ్య (45), రషీద్‌(49) తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరు ఉదయం హిల్‌కాలనీలో ఓటేసి మాచర్లకు వెళ్లారు. మిర్యాలగూడలోని బంగారుగడ్డకు చెందిన బంగారయ్య (42) పైలాన్‌కాలనీలో స్థిర నివాసం నిర్మించుకుని ఓ మద్యం దుకాణం వద్ద చేప ముక్కలు విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్నాడు.

నాగార్జునపేట సమీపంలోని జమ్మనకోట పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుని ఇంటికి వచ్చాడు. కాగా, పని నిమిత్తం బంగారయ్య తాను జీవనోపాధి పొందే హిల్‌కాలనీలోని మద్యం దుకాణం వద్దకు బైక్‌పై వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఇదే సమయంలో మాచర్ల నుంచి మల్లయ్య, రషీద్‌ ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో  పైలాన్‌కాలనీలోని కొత్త బ్రిడ్జి సమీపంలోని మసీదును దాటిన తర్వాత మూలమలుపు వద్ద రెండు బైక్‌లు వేగంగా ఒకదానికి ఒకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం మేరకు ఘటన స్థలాన్ని  సీఐ గౌరీనాయుడు, ఎస్‌ఐ నర్సింహారావు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతుహాలను స్థానిక కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచారు. 

మృతుల కుటుంబాల్లో విషాదం
నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం అనుకోని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించడంతో ముగ్గురి మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది. మల్లయ్యకు భార్య, కూతురు ఉండగా రషీద్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంగారయ్యకు ఇద్దరు కొడుకులున్నారు. ప్రమాదం జరిగిన వార్త తెలువగానే వెంటనే వారి కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి బోరున విలపించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు ఆస్పత్రిలో మిన్నంటాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నర్సింహారావు తెలిపారు.
చదవండి: తండ్రితో ఘర్షణ బకెట్‌తో కొట్టి హత్య

మరిన్ని వార్తలు