కోట్లు విలువ చేసే పదార్థం అమ్మే ప్రయత్నం.. ఇద్దరు అరెస్ట్‌

24 Jun, 2021 19:23 IST|Sakshi

ముంబై: సముద్రాల్లో తిమింగళాలు చేసుకునే వాంతిని(అంబర్‌గ్రిస్‌) పెద్దమొత్తంలో అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు మాజీ పోలీస్‌ కూడా ఉండడం విశేషం. అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల తయారీ ముడిపదార్థంగా అంబర్‌గ్రిస్‌ను వాడుతుంటారు. విషయంలోకి వెళితే.. ముంబైలోని లోవర్‌ పారెల్‌ ప్రాంతంలో గురువారం ఎస్‌యూవీ కారులో ఇద్దరు వ్యక్తులు తిమింగళం వాంతి(అంబర్‌గ్రిన్‌)ని తీసుకెళుతున్నట్లు ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు సమాచారం అందింది.

తమకు అందిన సమాచారం నిజమేనని నిర్థారణ చేసుకున్న పోలీసులు సీతానగరం మిల్స్‌ వద్ద వారిని అడ్డుకొని 7.75 కోట్లు విలువ చేసే తిమింగళం వాంతిని స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులలో ఒకరు మాజీ పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించాడు. 2016లో అతనిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. తాజాగా రాయ్‌గడ్‌ జిల్లాలోని అలీబాగ్‌ తీర ప్రాంతంలో తిమింగళం వాంతి పదార్థాన్ని దొంగలించినట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

చదవండి: ఆన్‌లైన్‌ గోల్డ్‌ ట్రేడింగ్‌ పేరుతో భారీ మోసం
 

మరిన్ని వార్తలు