కూతురిని తీసుకొస్తూ.. కానరాని లోకాలకు

15 Jul, 2021 07:33 IST|Sakshi
మృతిచెందిన రమణయ్య, రామయ్య

సాక్షి,సాక్షి, వైఎస్ఆర్‌ కడప: కొన్ని రోజులు కన్న బిడ్డ బంధువుల ఇంటికి వెళ్లే సరికి ఆ తండ్రికి మనసు మనసులో లేదు. బిడ్డను ఇంటికి పిలుచుకురావడానికి వెళ్లాడు. బంధువుతో కలిసి బైక్‌ పై వస్తుండగా విధి వక్రించింది.ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీకొనడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు.  ఈ దుర్ఘటనలో పాపకు తీవ్రగాయాలయ్యాయి. చక్రాయపేట మండలం అద్దాలమర్రి సమీపంలో బుధవారం సాయంత్రం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో రమణయ్య (33), రామయ్య(50) మృతి చెందాగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఎస్‌ఐ రఘురాం, బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడపకు చెందిన రమణయ్య గృహనిర్మాణాలకు సంబంధించి రాడ్‌ బెండర్‌గా పని చేసేవాడు. ఇతని కుమార్తె నందు(11) కొన్ని రోజుల కిందట అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది.

కూతురును తీసుకురావడానికి రమణయ్య ద్విచక్రవాహనంపై నంబులపూలకుంట వెళ్లాడు. సమీప బంధువు రామయ్య, నందుతో కలిసి కడపకు తిరుగుప్రయాణం అయ్యారు.అద్దాలమర్రి సమీపంలో వీరి వాహనం, వేంపల్లెకు చెందిన బాషా ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో రమణయ్య, రామయ్య అక్కడికక్కడే మృతించెందారు. తీవ్రంగా గాయపడిన నందును వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాషాకు స్వల్పగాయాలయ్యాయి. నందు పరిస్థితి విషమంగా ఉండటంతో కడప జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. మృతుల వద్ద ఉన్న ఫోన్‌ నంబర్ల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. రామయ్య కూడా కూలిపనులు చేసుకుంటూ జీవించేవాడని తెలిసింది.    

మరిన్ని వార్తలు