ఎఫ్‌ఆర్‌ఓ హత్యకేసులో ఇద్దరికి జీవితఖైదు

4 Aug, 2023 02:46 IST|Sakshi

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు తీర్పు 

ఏడు నెలల్లోపే విచారణ పూర్తి చేసి శిక్ష విధింపు

కొత్తగూడెంటౌన్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన అటవీ శాఖ రేంజ్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్‌ఓ) శ్రీనివాసరావు హత్య కేసులో నిందితులు మడకం తుల, పొడియం నాగకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌ గురువారం తీర్పు చెప్పారు. జీవితఖైదుతో పాటు రూ.1000 చొప్పున జరిమానా విధించారు. ఏడు నెలల్లోపే ఈ విచారణ పూర్తి చేసి శిక్ష విధించడం గమనార్హం. 

ఏం జరిగిందంటే... 
జిల్లాలోని చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ పరిధి ఎర్రబోడులో ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చిన గొత్తికోయలు అటవీ భూముల్లో పోడు సాగు చేసుకుంటున్నారు. దీంతో ఆ భూములను అటవీ అధికారులు స్వా«దీనం చేసుకుని ప్లాంటేషన్‌ చేశారు. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌ 22న గొత్తికోయలు ఆ భూముల్లో పశువులు మేపుతుండగా ప్లాంటేషన్‌ వాచర్‌ భూక్యా రాములు, బేస్‌ వాచర్‌ ప్రసాద్‌ అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది.

ఈ విషయాన్ని వారు ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు దృష్టికి తేగా ఆయన రావికంపాడు సెక్షన్‌ అధికారి తేజావత్‌ రామారావుతో అక్కడికి వెళ్లారు. ఈ భూముల్లో పశువులు మేపొద్దని చెబుతూ.. వీడియో తీస్తుండగా గొత్తికోయలు మళ్లీ గొడవ పడ్డారు. ఈ క్రమంలో మడకం తుల, పొడియం నాగ వేట కొడవళ్లతో ఎఫ్‌ఆర్‌ఓ మెడపై నరికారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును ఖమ్మం తరలిస్తుండగానే మృతిచెందారు.

ఈ ఘటనపై నాటి చండ్రుగొండ ఎస్‌ఐ విజయలక్ష్మి, సీఐ వసంత్‌కుమార్‌ కేసు నమోదు చేయగా, 24 మంది సాక్షులను విచారించిన జడ్జి.. నేరం రుజువు కావడంతో నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పుచెప్పారు. కోర్టు తీర్పు నేపథ్యంలో శ్రీనివాసరావు కుటుంబసభ్యులు, అటవీ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు